ఇప్పటికైనా సోనియా, రాహుల్‌లు క్షమాపణ చెప్పాలి

28 Jun, 2019 17:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గాంధీ - నెహ్రూ కుటుంబానికి ప్రాధాన్యం తగ్గుతుందనే ఉద్దేశంతోనే.. పీవీ నరసింహరావును పక్కకు పెట్టారని ఆయన మనవడు సుభాష్‌ ఆరోపించారు. నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు సుభాష్‌. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీవీకి కాంగ్రెస్‌ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదనీ, అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో పీవీ నరసింహరావుకు క్షమాపణలు చెప్పాలని సుభాష్‌ డిమాండ్‌ చేశారు.

రాజీవ్‌ గాంధీ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ.. అస్తవ్యస్తంగా మారిన దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడానికి కృషి చేశారన్నారు. నాడు పీవీ తీసుకున్న నిర్ణయాలే నేటి దేశ ఆర్థిక ప్రగతికి కారణమన్నారు. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ కూడా గుర్తించారు. ప్రశంసించారు. కానీ సొంత పార్టీ వారు మాత్రం పీవీ ప్రతిభను గుర్తించకపోవడం దారుణం అన్నారు. ప్రభుత్వం విజయాల్ని తమ విజయాలుగా కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారనీ, ప్రభుత్వ వైఫల్యాల్ని మాత్రం పీవీ వైఫల్యాలుగా చిత్రీకరించారని సుభాష్‌ విమర్శించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి పీవీ పార్థివ దేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతించలేదన్న వాస్తవం సాక్ష్యాధారాలతో సహా ఉందన్నారు సుభాష్. ఒక్క పీవీది తప్ప మిగతా మాజీ ప్రధానుల సమాధులన్నీ ఢిల్లీలో ఉన్నాయనీ, కాంగ్రెస్ నేతలు చూపించే విరుద్ధ వైఖరికి ఇదే సాక్ష్యం అన్నారాయన.

నేడు పీవీ జయంతి సందర్భంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ ఇతర పార్టీల నాయకులు ఆయనకు నివాళులర్పించారని.. కానీ కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఆయనను పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, గాంధీ కుటుంబం తాము చేసిన తప్పును ఒప్పుకొని... పీవీకి చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలని కోరారు సుభాష్.

మరిన్ని వార్తలు