కొంపముచ్చిన మొక్కుబడి హెచ్చరికలు

1 Apr, 2020 08:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ పుట్టుకొచ్చిన చైనాలోని వుహాన్‌ పట్టణంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 3వ తేదీన రెండు ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తీసుకొచ్చింది. వారందరిని 14 రోజులపాటు నిర్బంధ వైద్య శిబిరం (క్వారెంటైన్‌)లో ఉంచింది. అందుకు భారత సైన్యం ఆగమేఘాల మీద విమానాశ్రయంలోనే మంచి ఏర్పాట్లు చేసింది. చైనాలో మొట్టమొదటి కరోనా కేసు డిసెంబర్‌ 31వ తేదీన, భారత్‌లో తొలి కేసు జనవరి 30వ తేదీన కేరళలో బయటపడిన నేపథ్యంలో భారత్‌ ప్రభుత్వం క్వారెంటైన్‌ లాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంది.
(చదవండి: రిటైర్మెంట్‌ గడువు పెంచం: కేంద్రం)

చైనా నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ జనవరి 17వ తేదీన తొలి ట్రావెల్‌ హెచ్చరిక జారీ చేసింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలనిగానీ, వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలనిగానీ ఆ ట్రావెల్‌ హెచ్చరికలో లేదు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ మధ్య జారీ చేసిన ట్రావెల్‌ హెచ్చరికల్లో మాత్రమే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్‌ చేస్తామని, క్వారెంటైన్‌కు పంపిస్తామని భారత ఆరోగ్య శాఖ పేర్కొంది.

చైనా నుంచి భారత్‌కు ఎవరు వచ్చినా వారికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తామని క్వారెంటైన్‌కు కూడా పంపిస్తామంటూ ఫిబ్రవరి 26వ తేదీ నాటి ట్రావెల్‌ హెచ్చరికలో మొదటి సారి పేర్కొన్నారు. ఆ తర్వాత మార్చి 2వ తేదీన జారీ చేసిన ట్రావెల్‌ హెచ్చరికలో చైనా దేశం పేరుతోపాటు దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ, జపాన్‌ దేశాల పేర్లను పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే అంటే, మార్చి మూడవ తేదీన జారీ చేసిన ట్రావెల్‌ హెచ్చరికలో ఈ దేశాల పేర్లతోపాటు హాంకాంగ్, మకావు, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, నేపాల్, థాయ్‌లాండ్, సింగపూర్, తైవాన్‌ దేశాల పేర్లను పేర్కొన్నారు.  ఈ దేశాలకు చెందిన ప్రయాణికులందరికి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడంతోపాటు విధిగా 14 రోజుల పాటు ‘సెల్ఫ్‌ క్వారెంటైన్‌ (స్వీయ నిర్బంధం)’లో ఉండాలంటూ మార్చి 10వ తేదీన మరో ట్రావెల్‌ హెచ్చరిక జారీ చేసింది.
(చదవండి: కరోనా కంగారు!)

2020, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ లోపల వచ్చిన ప్రయాణికులంతా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతోపాటు ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచిస్తూ మార్చి 11వ తేదీన మరో ట్రావెల్‌ హెచ్చరిక జారీ చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 14 రోజులంటే ఫిబ్రవరి నెలలోనే స్వీయ నిర్బధం ముగిసి పోతుంది. అలాంటప్పుడు మార్చి 11వ తేదీన ఎందుకు హెచ్చరిక చేయాల్సి వచ్చిందో, పైగా మార్చి 13వ తేదీ నుంచి ఆ హెచ్చరిక అమల్లోకి వస్తుందంటూ గందరగోళంగా పేర్కొంది. తాము అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విధిగా క్వారెంటైన్‌ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ మార్చి 16వ తేదీన మరో ట్రావెల్‌ హెచ్చరికను జారీ చేసింది.

జనవరి 18 నుంచి మార్చి 23వ తేదీల మధ్య భారత్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగిన 15 లక్షల మంది ప్రయాణికులపై నిఘా ఉంచాల్సిందిగా కోరుతూ కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా అన్ని రాష్ట్రాలకు ఓ లేఖ రాశారు. ఈ సమాచారం అంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ‘బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌’ వద్ద ఉంటుంది కనుక కేంధ్రం స్పందించడం సముచితం. ఫిబ్రవరి మూడవ తేదీన చైనాలోని వుహాన్‌ నుంచి తీసుకొచ్చిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన క్వారెంటైన్‌ విధానాన్ని అలాగే కొనసాగించి ఉన్నట్లయితే దేశంలోకి కరోనా వైరస్‌ అంతగా విస్తరించేది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేరళలోని తొలి కేసు మినహా స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా హెచ్చరించి వదిలేసిన ప్రయాణికులు అలా చేయక పోవడం వల్ల వారి నుంచి కరోనా దేశంలో ఎక్కువగా విస్తరించింది. 
(చదవండి: గల్లీల్లో 'ఢిల్లీ')

మొదటి ఉదాహరణ: ఒడిశాలో నెంబర్‌ వన్‌ కరోనా కేసుగా నమోదైన 33 ఏళ్ల రిసెర్చర్‌ ఇటలీ నుంచి మార్చి ఆరవ తేదీన ఢిల్లీకి వచ్చారు. ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లకుండా ఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో మకాం వేసి మార్చి 12వ తేదీన భువనేశ్వర్‌కు చేరుకున్నారు.
 
రెండో ఉదాహరణ: జర్మనీ నుంచి స్పెయిన్‌ మీదుగా మార్చి 13వ తేదీన బెంగళూరు చేరుకున్న ఓ భారత రైల్వే ఉద్యోగి కుమారుడి(25 ఏళ్లు)ని కూడా స్వీయ నిర్వంధంలో ఉండాల్సిందిగా హెచ్చరించి పంపించారు. అయినా ఆ హెచ్చరిక ఆ యువకుడు పాటించలేదు. ఐదు రోజుల అనంతరం అతనికి కరోనా సోకినట్లు తేలింది. జరిగిన పొరపాటును కేంద్ర ప్రభుత్వం గ్రహించడంతోపాటు కరోనా ముప్పు తీవ్రతను గ్రహించినట్లుంది. అందుకే చైనా, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలకన్నా తీవ్ర స్థాయిలో ‘లాక్‌డౌన్‌’ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమయింది.

మరిన్ని వార్తలు