ఢిల్లీలో అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్‌ కష్టాలు

8 Apr, 2020 04:52 IST|Sakshi

14 రోజులు పూర్తయినా కదల్లేని పరిస్థితి

పలువురు తెలుగువారి నిరీక్షణ

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలను రద్దుచేయడంతో పాటు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు తప్పనిసరి క్వారంటైన్‌ నిబంధన పెట్టడంతో వారంతా ఢిల్లీలో 14 రోజుల పాటు క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. అయి తే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండడంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను దేశంలోకి అనుమతించలేదు. అప్పటికే మార్చి 19, 20, 21, 22 ఉదయం వరకు ఢిల్లీలో దిగి, దేశంలో ఇతర ప్రాంతాలకు ప్ర యాణించాల్సిన వారందరినీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసి క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రెండు, మూడు వందలమంది ప్రయాణికులున్నట్లు అంచనా. వీరంతా అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌ తదితర దేశాల నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖ చేరుకోవాల్సి ఉం ది. అయితే ప్రభుత్వం ఆదేశాలతో క్వారంటైన్‌ సెంటర్లలో కొందరు చేరిపోగా.. 14 రోజులపాటు తాము ఖర్చు భరించగలమనుకున్నవారు ప్రభుత్వం సూచించిన మూడు ప్రైవేట్‌ హోటళ్లలో చేరారు.

14 రోజుల పాటు ఒక్కొక్కరు వసతి కోసం దాదాపు రూ.53 వేల వరకు చెల్లించారు. 14 రోజులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి, సమీపంలో ఉన్న హోటళ్లకు గానీ, లేదా ఢిల్లీలో ఉన్న బంధువులను గానీ ఆశ్రయించాలని ఆదేశించింది. దీంతో చేసేది లేక సమీపంలోని ప్రైవేట్‌ హోటళ్లలోకి చేరుకున్నారు. తొలుత 14 రోజులకు సిద్ధపడగా.. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఈనెల 15 వరకు తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా తాము తమ గమ్యస్థానాలకు చేరుకుంటామో లేదోనన్న ఆందోళనలో వారంతా ఉన్నారు. దీనిపై ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌ల అధికారులను సంప్రదించగా.. హోం శాఖ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని జవాబు వచ్చినట్లు ఈ ప్రయాణికులు తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డికి కూడా సమాచారం ఇచ్చామన్నారు.

మరిన్ని వార్తలు