ఇంటర్వ్యూలో రాధేమా ఆసక్తికర విషయాలు

23 Oct, 2017 13:22 IST|Sakshi

సాక్షి, ముంబై : దైవాంశ సంభూతురాలు.. శివుడికి-భక్తులకి మధ్య సంధానకర్త... పైగా దుర్గా మాత అవతారం. ఎలాంటి సమస్యలైనా భగవంతుడికి నేరుగా నివేదించగలిగే స్థాయి ఆమెది. ఇలాంటి ప్రకటనలతో వార్తల్లో నిలిచే రాధే మా మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈసారి వివాదంతో కాదు. ఓ ప్రముఖ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలనే వెల్లడించారు. సుఖ్విందర్‌ కౌర్.. రాధే మా గా ఎలా మారింది? ఆరోపణలపై ఆమె స్పందన ఏంటి? సూసైడ్‌ చేసుకోవాలని ఎందుకనుకుంది? తదితర విషయాలపై ఆమె స్పష్టత ఇచ్చారు.

వ్యక్తిగత జీవితం... 

పంజాబ్‌కు చెందిన సుఖ్విందర్ కౌర్ తల్లిదండ్రులు 17 ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహం చేశారు. మూడేళ్లలో ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవటంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. ఆ సమయంలోనే భర్త విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకన్నాడంట. కాళ్ల మీద పడి బ్రతిమాలిన కనుకరించలేదని ఆమె చెప్పారు. ఆ సమయంలో తనకు తెలిసిన దర్జీ పనితో కొంతకాలం జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆమె తర్వాత ఆధ్యాత్మికం వైపు మళ్లినట్లు చెప్పారు. ముంబైకి మకాం మార్చాక ఆమె పూర్తిగా దైవ ధ్యానంలోనే నిండిపోయిందంట. అప్పుడే ఆమె చుట్టూ భక్తులు చేరిపోవటం.. అతి తక్కువ సమయంలోనే ఆమె పేరు మారుమోగిపోవటం జరిగిపోయాయంట.

వేషాధారణ గురించి...

మోడ్రన్‌ అవతారంలో వేషాధారణ. గంతులు... అసలు ఆమె జీవనశైలిపైనే పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపిస్తుంటాయి.  కానీ, అవేం తనను ఆపలేవని ఆమె అంటున్నారు. ‘‘ఇవన్నీ నా బిడ్డలు ఇచ్చిన బహుమతులు. భక్తి పేరుతో ఆశ్రయించేవారిని కొల్లగొట్టడం నాకు తెలీదు. జీవితంలో దుర్భర జీవితాన్ని గడిపిన నేను ఎంచుకున్న మార్గం సక్రమమైందనే నాకు తెలుసు. ఇదే నా జీవితం. నేను ఇలాగే ఉంటాను. ఈ లోకం కోసం నేను అస్సలు మారను. మిగతా సాధువల్లా నేను కొన్ని భోగాలను పరిత్యజించాను. అవేంటో లోకానికి వివరించాల్సిన అవసరం నాకు లేదు అని ఆమె తెలిపింది. 

వివాదాలు-ఆరోపణలు... 

తనపై వినిపిస్తున్న ఆరోపణలపై కూడా ఆమె స్పందించారు. ముఖ్యంగా ముంబైకి చెందిన ఓ మహిళ గృహ హింస కేసులో రాధే మా పేరును కూడా ప్రస్తావించటం తెలిసిందే. ఆ కుటుంబం తన వీరభక్తులని.. వారి కుటుంబ కలతను పరిష్కరించేందుకే అక్కడికి వెళ్లానని ఆమె చెప్పారు. కానీ, ఆ ఇంటి కోడలు డబ్బు కోసమే తన పేరును కేసులోకి లాగిందని రాధే మా తెలిపారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ, నా బిడ్డల కోసం ఆలోచించా. నేను పోతే వారిని ఎవరు చూసుకుంటారు. అందుకే ఆ ప్రయత్నం విరమించుకుని.. మానసిక వైద్యుడి పర్యవేక్షణలో కౌన్సిలింగ్ తీసుకున్నా అని ఆమె వివరించింది. డాన్సింగ్ వీడియోలపై స్పందిస్తూ... అవి తన వ్యక్తిగతమని, వాటిని బయటపెట్టి కొందరు పెద్ద తప్పు చేశారని ఆమె చెప్పారు. ఫేక్‌ స్వామిజీల జాబితాలో తన పేరు ఉండటం, గుర్మీత్ రామ్‌ రహీమ్ సింగ్ గురించి ప్రశ్నలకు.. ఆమె మౌనంగా ఉండటం విశేషం. తన జీవితం ఓ తెరచిన పుస్తకం అంటూనే.. మధ్యమధ్యలో కంటతడి పెట్టడం.. భక్తుల కోసమే తన జీవితమని చెప్పటం.. ఇలా ఆ 20 నిమిషాల ఇంటర్వ్యూలో రాధే మా అపరిచితురాలిని తలపించిందన్న కామెంట్లు వచ్చిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు