-

రాయ్‌ బరేలీ ఎన్టీపీసీ పేలుడు వీడియో

3 Nov, 2017 14:10 IST|Sakshi

లక్నో : రాయ్‌ బరేలీ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 32కి చేరింది. తీవ్ర గాయాలపాలైన 12 మందిని ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఎన్‌టీపీసీ ప్రాంతీయ అధికారి ఆర్‌ఎస్‌ రత్తీ ప్రకటించారు. ఘటన జరిగిన విధానం కోసం నిపుణులతో కూడిన కమిటీని నియమించి 30 రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు.  

ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఆదిత్యానాథ్‌ ప్రభుత్వానికి ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బాయిలర్‌ను ఇంజనీర్లు అమర్చే క్రమంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే అది లోపల కాకుండా బయట మాత్రమే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సమస్య ఉందని తెలిసి కూడా యూనిట్ ను ఎందుకు మూసేయలేదన్న ప్రశ్నకు.. మరమత్తులు చేయలేమన్న సమయంలో మాత్రమే తాము వాటిని మూసేస్తామని, ఢిల్లీలోని కంట్రోల్‌ రూమ్‌కు కూడా ఈ మేరకు పూర్తి సమాచారం పంపించామని ఆయన సమాధానమిచ్చారు.

ఇక ఘటన జరిగిన అనంతరం అక్కడ నమోదైన దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. బాయిలర్‌లో పేలుడు ధాటికి మంటలు, పెద్ద ఎత్తున్న పొగ వెలువడటం అందులో చూడొచ్చు. ఆ సమయంలో అక్కడ పని చేసే వారి అరుపులు అందులో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఓ వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 

ఉంచహర్‌ ప్లాంట్‌లోని ఆరో యూనిట్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడుతో ప్రమాదం సంభవించింది. వేడి వాయువులు, నీటి ఆవిరితో సమీపంలో పనిచేస్తున్న కార్మికులపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 100 మందికి గాయాలు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు