వారిని చూస్తేనే చాలు ఛీత్కారం..

16 May, 2017 08:09 IST|Sakshi
వారిని చూస్తేనే చాలు ఛీత్కారం..

న్యూఢిల్లీ: చెత్తలో చిత్తు కాగితాలు ఏరేవారిని చూస్తే సమాజానానికి ఛీత్కార భావం. కాని వారు సమాజానానికి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. దేశంలో ఏడాదికి 620 లక్షల టన్నుల చెత్తను వారు ఏరివేయడమే కాకుండా అది రీసైక్లింగ్‌కు వెళ్లేలా చేస్తున్నారు. ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో రైళ్లు శుభ్రంగా ఉండడానికి కూడా వారే కారణం. అజ్మీర్‌ నుంచి ఢిల్లీ వచ్చే అజ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రాత్రి 11 గంటలకు ప్రయాణికులు దిగాక ఓ మూలన నిలిపేస్తారు. అప్పుడు బిరబిరమంటూ ర్యాగ్‌ పిక్కర్స్‌ రైలు బోగీల్లోకి వెళ్లి సగం తిని పడేసిన తిను బండారాలను, చెత్త కింద పడేసిన కాగితాలను ఏరుకుపోతారు. ఒక్క ఢిల్లీలోనే ర్యాగ్‌ పిక్కర్స్‌ ఐదు లక్షల మంది ఉండగా, దేశవ్యాప్తంగా 15 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంటారని ఓ అంచనా.

దేశంలో మహా కూడిన చెత్తలో ఎప్పటికప్పుడు చెత్తను సేకరించే సామర్థ్యం  పంచాయితీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు 75 శాతానికి మించి లేదట. ఆ లెక్కన 25 శాతం చెత్తను ర్యాగ్‌ పిక్కర్లే సేకరిస్తున్నారన్నది ‘ఇండియా స్పెండ్‌’ సంస్థ అంచనా. వారికి జీతాలు, భత్యాలు ఉండవు. బతుక్కే భద్రత ఉండదు. చిత్తు కాగితాలు, ఇనుప రేగులు, ఇనుప ఊసలు, విరిగిన ప్లాస్టిక్‌ ముక్కలు, పగిలిన సీసల కోసం వారు పెంట కుప్పలు తిరుగుతున్నప్పుడు వారి చేతులకు, కాళ్లకు గాయాలవుతాయి. ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. శ్వాసకోశ వ్యాధులు తప్పవు. టీబీ కూడా వస్తుంది. అన్నింటిని భరిస్తున్నా వారికి కడుపు నిండా అన్నం కంటి నిండా నిద్ర ఉండదు. వారిని సమాజం శారీరకంగా, మానసికంగా చీదరించుకుంటుంది. వారిపై అప్పుడప్పుడు అత్యాచారాలు కూడా జరుగుతుంటాయి.

ర్యాగ్‌ పిక్కర్స్‌ సమాజానికి ఎంతో మేలుచేస్తున్న విషయాన్ని తాను గ్రహించానని వారి పేరిట ఓ అవార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించానని మాజీ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ 2015లో గర్వంగా ప్రకటించారు. ప్రతి ఏటా ముగ్గురు ర్యాగ్‌ పిక్కర్స్‌కు, మూడు స్వచ్ఛంద సంస్థలకు ఈ కొత్త అవార్డు కింద 1,50,000 రూపాయల చొప్పున నగదును  అందజేస్తానని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ అవార్డును అమలు చేసిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం కూడుతున్న చెత్త 2030 నాటికి మూడింతలు పెరిగి 16.5 కోట్ల టన్నులకు చేరుకుంటుందని, 2050 నాటికి 45 కోట్ల టన్నులకు చేరుకుంటుందని కూడా ఆయన తెలిపారు.

ఢిల్లీలోని కెమికల్స్‌ హెల్త్‌ విభాగంలో సీనియర్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పాపియా సర్కార్‌ కథనం ప్రకారం ర్యాగ్‌ పిక్కర్స్‌ నాలుగు రకాలు. ఒకరు పెంట కుప్పలకు వెళ్లి ఏ చెత్తనైనా ఏరుకునేవారు. ఇల్లిల్లు తిరుగుతూ పనికొచ్చే వస్తువులను కొనుక్కెళ్లేవారు రెండోరకం, మూడు చక్రాల రిక్షాలో చెత్తను తీసుకెళ్లేవారు మూడవరకం, అన్ని రకాల పనికిరాని వస్తువులను కొనేందుకు చిన్న దుకాణాలను నడిపేవారు నాలుగోరకం. వీటిలో మొదటి రకం ర్యాగ్‌ పిక్కర్స్‌దే  దర్భుర జీవితం. వారిలో ఏ కుటుంబాన్ని కదిలించినా ఓ కన్నీటి కథ వినిపిస్తుంది.

తమను అనుమానాస్పదంగా, అంటరానివారిగా చూస్తారని, అసహించుకుంటారని, శరీరమేమో జబ్బులతో కుళ్లిపోతుందని ఢిల్లీలోని ర్యాగ్‌పిక్కర్స్‌ కాలనీ వాసులు చెబుతున్నారు. ఇక్కడ 250 కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారు. తమకూ కొంత గౌరవ వేతనం ఇవ్వాలని, రేషన్‌ కార్డులు సౌకర్యం కల్పించాలని, గుడెశెలకు స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీలంకలో మున్సిపాలిటీలు ప్రతి ర్యాగ్‌పిక్కర్‌కి రోజుకు రెండు డాలర్ల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నాయి.

మరిన్ని వార్తలు