పెద్దల సభకు రాలేనంటున్న రాజన్‌

9 Nov, 2017 09:25 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆఫర్‌ చేసిన రాజ్యసభ సీటును ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని వదిలిపెట్టి రాజ్యసభ సభ్యుడిగా పనిచేయలేనని రాజన్‌ పేర్కొన్నారు. ఆప్‌ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆఫర్‌పై రాజన్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రఘురామ్‌ రాజన్‌ అధ్యాపక వృత్తిలో మమేకమై ఉన్నారని, భారత్‌లో కూడా విభిన్న విద్యా కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారని కార్యాలయం ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోలో పూర్తిస్థాయి అధ్యాపకుడిగా కొనసాగేందుకే రాజన్‌ ఇష్టపడుతున్నట్లు ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.

కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ముగ్గురు సభ్యులను జనవరిలో రాజ్యసభకు పంపనుంది. ఈ మూడు స్థానాలను ఆప్‌ పార్టీ నేతలను కాకుండా.. ఆయా రంగాల్లో నిష్ణాతులను పంపాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రఘురామ్‌ రాజన్‌ను రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఆప్‌ పార్టీ నేత ఆశిష్‌ ఖేతన్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

మరిన్ని వార్తలు