కరోనా : రఘురామ్ రాజన్ సూచనలు

24 Mar, 2020 13:03 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశంలో వేగంగా కరోనా వైరస్ మహమ్మారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నరు రఘు రామ్ రాజన్ స్పందించారు.  ఈ సంక్షోభ సమయంలో ఆర్బీఐ పోషించాల్సిన పాత్రపై కొన్ని సూచనలు చేశారు. వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న వ్యాపారాలకు క్రెడిట్ ఇవ్వడం అవసరం ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కష్ట సమయంలో పేదలు మనుగడ సాగించడానికి తాత్కాలిక ఆదాయ బదిలీ పథకాన్ని అమలు చేయాలని రఘురామ్ రాజన్ సూచించారు. ఇండియా టుడే న్యూస్ తో ప్రత్యేకంగా సంభాషించిన ఆయన ఇప్పటికే బలహీనమైన భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ మహమ్మారి కరోనావైరస్  దెబ్బ పడిందని, ఈ ప్రభావాన్ని ఆర్బీఐ, కేంద్రం మృదువుగా డీల్ చేయాలని అభిప్రాయపడ్డారు. చిన్న మధ్యతరహా సంస్థలతో పాటు పెద్ద సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. ఇందుకు ప్రభుత్వం పాక్షిక హామీలు ఇవ్వాలి. అదే సమయంలో కొన్ని ప్రోత్సాహకాలను అందించాలి, తద్వారా బ్యాంకులు క్రెడిట్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు.

అలాగే ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యత సడలింపును అనుసరిస్తున్న ఇతర  కేంద్ర బ్యాంకుల వైఖరిని ఆర్ బీఐ   కూడా అనుసరించాలని సూచించారు. అయితే  చెడురుణాల బెడద అధికంగా ఉన్నందు వల్ల ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి అన్నారు.  దీర్ఘకాలిక పథకాలకు ఇది సమయం కాదు, దీనికి తగినంత నిధులు కూడా లేవు కనుక, సాధ్యమైనంతవరకు  తాత్కాలిక ఆదాయ మద్దతుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  ఇందులో మొదటి  ప్రాధాన్యత వైద్య సదుపాయాలకు వెళ్లాలని ఆయన అన్నారు. ఆ తరువాత ఎక్కువగా ప్రభావితమైన ప్రజలకు కొన్నినెలల పాటు నగదు సాయం చేరాలి.

తద్వారా అల్పాదాయ వర్గాల  వారికి ఊరట లభించాలి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో లభ్యమవుతున్న మెడికల్ వనరులను  అందింపుచ్చుకోవాలన్నారు. తక్షణం మనకు దొరికిన చోట అవసరమైన  అన్ని సరఫరాలను తీసుకోవాలన్నారు.  ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రతి దేశంలాగానే మనం కూడా  ప్రతి మార్గాన్ని అన్వేషించాలని తెలిపారు. ప్రస్తుత  క్లిష్టమైన పరిస్థితులను అధిగమించేందుకు స్వయం సమృద్ధిగా ఉన్నారా అనే ప్రశ్న సంక్షోభం లేవనెత్తుతున్నప్పటికీ, ఇది స్వల్ప కాలానికి సంబంధించిన అంశమేనని రఘురామ్ రాజన్ వెల్లడించారు.

కాగా  వైరస్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్ బ్యాంక్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో వార్ రూమ్ అందుబాటులోకి తెచ్చామని,  ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. చరిత్రలో కూడా ఇదే తొలిసారి అని ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి విదితమే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా