రికవరీ పేరుతో రైతులను వేధిస్తున్న బ్యాంకులు

11 Jul, 2019 18:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణి ప్రదరిస్తూ పారిశ్రామికవేత్తలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని రైతు ఆత్మహత్యల అంశాన్ని రాహుల్‌ గురువారం లోక్‌సభలో లేవనెత్తారు. రైతులకు ఊరట ఇచ్చే ఎలాంటి చర్యలూ కేంద్ర బడ్జెట్‌లో తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు కేవలం రూ 4.3 లక్షల కోట్ల పన్ను మినహాయింపులు ఇచ్చిన కేంద్రం సంపన్న పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ 5.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని దుయ్యబట్టారు.

కేం‍ద్రం రైతుల పట్ల వివక్ష చూపుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ రుణాలు, గిట్టుబాటు ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల కిందట ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రుణభారంతో తన నియోజకవర్గం వయనాడ్‌లో బుధవారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని సభ దృష్టికి తీసుకువచ్చారు.

రుణ బకాయిలున్న రైతులకు బ్యాంకులు రికవరీ నోటీసులు జారీ చేసి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని, దిక్కుతోచని స్ధితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రుణాలపై మారటోరియం విధించిందని, బ్యాంకులు రుణ వసూళ్లను నిలిపివేసి రుణాల రీషెడ్యూల్‌ చేయాల్సిందిగా ఆర్‌బీఐని ఆదేశించాలని కోరారు.

మరిన్ని వార్తలు