‘ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో కేంద్ర సర్వీసులు’

22 May, 2018 15:27 IST|Sakshi
కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర సర్వీసుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఇష్టానుసారంగా అధికారులను నియమించుకునేలా మోదీ సర్కార్‌ యూపీఎస్‌సీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కేంద్రం తీరుతో విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధించిన లేఖను కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన రాహుల్‌ విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అభ్యర్థుల హక్కును కాలరాస్తూ కేంద్ర సర్వీసుల్లోకి ఆర్‌ఎస్‌ఎస్‌కు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేలా ప్రధాని ప్రయత్నిస్తున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

పరీక్ష ర్యాంకులను పక్కనపెట్టి సబ్జెక్టు ప్రాతిపదికన మెరిట్‌ జాబితాను తారుమారు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థుల భవితవ్యాన్ని దెబ్బతీసే ఈ ప్రతిపాదన పట్ల గొంతెత్తాలని రాహుల్‌ పిలుపు ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తనకు నచ్చిన అధికారులను ఎంచుకునేలా మోదీ వ్యవహరిస్తున్నారని రాహుల్‌ తన ట్వీట్‌లో ఆరోపించారు.

సివిల్‌ సర్వీస్‌ పరీక్షల ఆధారంగా ప్రస్తుతం అభ్యర్థులకు సర్వీసులను కేటాయిస్తుండగా, తాజాగా పరీక్ష అనంతరం ఫౌండేషన్‌ కోర్సు ముగిసిన తర్వాత నియామకాలు చేపట్టడాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది.



 

>
మరిన్ని వార్తలు