భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు

7 Jun, 2019 18:19 IST|Sakshi

తిరువనంతపురం : కేరళలోని వయనాడ్ నియోకవర్గంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి 4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో అఖండ విజయం సాధించిన రాహుల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాహుల్‌ చేపట్టిన తొలి పర్యటన ఇదే. కేరళకు చేరుకున్న రాహుల్‌కు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ్నించి ఆయన వయనాడ్ వీధుల గుండా ఓపెన్ ట్రక్కులో బయలుదేరారు.

రుతుపవనాల కారణంగా వర్షం జల్లులు పడుతుండటంతో ఓపెన్ ట్రక్కులోనివారు తడిసిపోకుండా ఓ గొడుగు లాంటి ఏర్పాటు చేశారు. వర్షపు జల్లులను కూడా లెక్కచేయకుండా వందలాది మంది కార్యకర్తలు రోడ్‌షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 'రాహుల్ మేము మీతో ఉన్నాం' అనే బ్యానర్లతో కార్యకర్తలు రాహుల్‌కు స్వాగతం పలికారు. వయనాడ్‌ నుంచి రాహుల్ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుని సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఇంత పెద్ద విజయం కట్టబెట్టిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పేందుకు రాహుల్ మూడు రోజుల పర్యటన చేపట్టారు.

వయనాడ్, కోజికోడ్ జిల్లాలతో పాటు మలప్పురంలోనూ రాహుల్ రోడ్‌షోల్లో పాల్గోనున్నారు. శని, ఆదివారాల్లో వయనాడ్‌లోని వివిధ పట్టణాలతో పాటు తిరువంబాడి అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ ప్రసంగిస్తారని.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని కూడా రాహుల్ పరామర్శిస్తారని జిల్లా కాంగ్రెస్ నేతలు తెలిపారు.

మరిన్ని వార్తలు