షీలా దీక్షిత్‌ మృతిపట్ల ప్రముఖుల సంతాపం

20 Jul, 2019 17:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతి తమకు ఎంతో బాధను కలిగిందని ట్విట్‌ చేశారు. ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్‌ ఢిల్లీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. 'కాంగ్రెస్ పార్టీ ముద్దుల కూతురు షీలా దీక్షిత్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబానికి నా ప్ర‌గాఢ సంతాపం తెలుపుతున్నా' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఢిల్లీ అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఢిల్లీ అభివృద్ధికి షీలా దీక్షిత్‌ విశేష కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఆమె మరణ వార్త తనను ఎంతో బాధించిందని ట్విట్ చేశారు. షీలా దీక్షిత్‌ మృతి దేశానికి తీరని లోటని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

ఆమె మృతి దేశానికి తీరని లోటు : మన్మోహన్‌
షీలా దీక్షిత్‌ మృతి దేశానికి తీరని లోటని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఆమె మరణవార్త తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రిగా ఆమె అందించిన సేవలను ఢిల్లీ ప్రజలు ఎప్పుడూ మరచిపోరని తెలిపారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్‌.. ఢిల్లీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.

(చదవండి : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కన్నుమూత)

మరిన్ని వార్తలు