ఆ బాధేంటో మాకు తెలుసు : రాహుల్‌, ప్రియాంక

20 Feb, 2019 16:35 IST|Sakshi

లక్నో : ‘మా తండ్రి మరణించినప్పుడు కలిగిన బాధే ఇప్పుడు మీకు కలిగింది. ఆ బాధేంటో మాకు బాగా తెలుసు’ అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన కుటుంబాలను పరామర్శించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన రాహుల్‌, ప్రియాంకలు ఉగ్రదాడిలో మరణించి సీఆర్ఫీఎఫ్‌ జవాన్‌ అమిత్‌ కుమార్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జవాన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయత్రి మంత్రం పఠించారు. భారత్‌ మతాకీ జై అని నినాదాలు చేశారు.

‘ఈ విషాదంలో మీకు అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. దేశం కోసం నీ బిడ్డ ప్రాణత్యాగం చేసి మా గుండెల్లో నిలిచిపోయారు. అంతటి గొప్ప బిడ్డను కన్నందుకు మీకు ధన్యవాదాలు.’ అని బాధితులతో రాహుల్‌ గాంధీ అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను కాంగ్రెస్‌ పార్టీ తమ సోషల్‌ మీడియా పేజీల్లో పంచుకుంది.  ఏలాంటి రాజకీయ అవసరాన్ని ఆశించకుండా తమ పార్టీ ముఖ్య నేతలు అత్యంత గోప్యంగా పుల్వామ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించారని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఇక రాహుల్‌ గాంధీ తన పర్యటన మధ్యలో ఓ దాబలో సేద తీరిన వీడియోను పోస్ట్‌ చేశారు. 1991లో తమిళ టైగర్స్‌ సూసైడ్‌బాంబుకు అప్పటి ప్రధాని, రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీ మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ రాహుల్‌ తాజా పుల్వామా ఘటన బాధితులను ఓదార్చారు.

మరిన్ని వార్తలు