ఏఐసీసీలో కీలక నియామకాలు

21 Aug, 2018 14:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఏఐసీసీలో కీలక నియామకాలు చేపట్టారు. పార్టీ ట్రెజరర్‌గా రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ పటేల్‌ను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మోతీలాల్‌ ఓహ్రా స్థానంలో అహ్మద్‌ పటేల్‌ ఈ పదవిని చేపడతారు. సోనియా గాంధీకి కార్యదర్శిగా పనిచేసిన అహ్మద్‌ పటేల్‌ గతంలోనూ పార్టీ కోశాధికారిగా వ్యవహరించడంతో ఎన్నికల సమయంలో నిధుల సమీకరణకు ట్రెజరర్‌గా పటేల్‌ నియామకానికి రాహుల్‌ మొగ్గుచూపారు.

ఇక కరణ్‌ సింగ్‌ స్ధానంలో పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్‌పర్సన్‌గా మాజీ కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మను రాహుల్‌ నియమించారు. అసోం మినహా ఈశాన్య రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జ్‌గా లుజిన్హో సలేరియోను నియమించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోకి మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ను శాశ్వత ఆహ్వానితులుగా నియమిస్తూ రాహుల్‌ నిర్ణయం తీసుకున్నారు. దిగ్విజయ్‌ సింగ్‌, జనార్థన్‌ ద్వివేది, కమల్‌ నాథ్‌, సుశీల్‌ కుమార్‌ షిండే వంటి సీనియర్లను తప్పిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి నూతన బృందాన్ని తీసుకున్న తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టారు.

మరిన్ని వార్తలు