పట్నా కోర్టుకు హాజరైన రాహుల్‌ గాంధీ

6 Jul, 2019 14:17 IST|Sakshi

పట్నా : కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బిహార్‌కు చేరుకున్న రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయనపై పూల వాన కురిపిస్తూ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. కాగా దొంగలంతా మోదీ అనే ఇంటిపేరునే కలిగి ఎందుకు ఉంటారు అంటూ రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బిహార్‌ ఉపమఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ శనివారం పట్నా కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా..‘నా రాజకీయ ప్రత్యర్థులు ఆరెస్సెస్‌, బీజేపీ నన్ను వేధించే క్రమంలో ఇది మరొక కేసు. ఈరోజు 2 గంటలకు పట్నా సివిల్‌ కోర్టులో వ్యక్తిగత విచారణకు హాజరవుతున్నా. సత్యమేవ జయతే’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 542 లోక్‌సభ స్థానాలకు గానూ 52 స్థానాల్లో మాత్రమే పార్టీ గెలుపొందింది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ అభివృద్ధికి జవాబుదారీతనం కీలకమని, అందుకోసమే తాను రాజీనామా చేస్తున్నానని 49 ఏళ్ల రాహుల్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో నాలుగు పేజీల లేఖను పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు