‘తక్షణమే రేషన్‌ కార్డులు జారీ చేయండి’

16 Apr, 2020 12:35 IST|Sakshi

ప్రధాన మంత్రికి రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి

వలస జీవులను ఆదుకోవాలన్న ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ:  లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో పేదలకు తక్షణమే రేషన్‌ కార్డులు జారీ చేసి వారిని ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పేదలందరికీ ఉచితంగా రేషన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు... ‘‘ కరోనా సంక్షోభంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతీ ఒక్కరికీ అ‍త్యవసరంగా రేషన్‌ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేషన్‌కార్డు లేని వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. ఎన్నో ఖాళీ కడుపులు ఆహారం కోసం వేచి చూస్తుంటే.... ధాన్యాలన్నీ గోదాముల్లోనే నిలిచిపోయాయి. అమానుషం’’అని ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వలస జీవులను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ప్లీజ్‌ నరేంద్ర మోదీజీ వారికి సాయం చేయండి’ అంటూ వలస కార్మికుల కష్టాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.(లాక్‌డౌన్‌ సడలించే రంగాలు ఇవే..)

కుట్ర దాగి ఉంది... 
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన బాంద్రా రైల్వే స్టేషన్‌ ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే ఈ మేరకు పన్నాగం పన్ని ఉంటారని ఆరోపించింది. ఈ విషయం గురించి మహారాష్ట్ర మంత్రి అశోక్‌ చవాన్‌ మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోందంటూ వలస కార్మికులకు అసత్య సమాచారం అందడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ఈ విధంగా కుట్రపన్నారని ఆరోపించారు. తద్వారా కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నీరు గార్చాలనేది వారి ఉద్దేశమని ఆగ్రహం వ్యక్తం చేశారు.(రాజకీయ పోరాటం కాదు.. తెలియదా?)

కాగా లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం వేలాది కార్మికులు బాంద్రా రైల్వే స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వినయ్‌ దూబే అనే వ్యక్తి, ఓ టీవీ జర్నలిస్టునుపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు.(పేదల ఊసే లేదు, రాష్ట్రాలకు సాయం లేదు)

మరిన్ని వార్తలు