చైనా కిట్స్‌ అమ్మకంలో అవినీతిపై రాహుల్‌ ఫైర్‌

27 Apr, 2020 18:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా నుంచి రప్పించిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ను రెట్టింపు లాభాలకు అమ్ముకున్నారనే వార్తలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. చైనా కిట్స్‌ను సొమ్ము చేసుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. చైనా కిట్లపై రెట్టింపు ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఈ పరికరాలపై తప్పుడు ఫలితాలు వస్తున్నాయనే వార్తలపై రాహుల్‌ స్పందిస్తూ దేశమంతా కోవిడ్‌-19పై పోరాడుతుంటే కొందరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా లాభాలు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు..ఇలాంటి వారిని దేశం ఎన్నడూ క్షమించదని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

తమ అన్నాచెల్లెళ్లు బాధపడుతూ ఉన్నసమయంలోనూ అటువంటి పరిస్థితి ఆసరాగా తీసుకుని లాభాలు దండుకోవాలని ఏ ఒక్కరైనా ప్రయత్నిస్తారా అనేది మన ఊహకందని విషయమని మరో ట్వీట్‌లో రాహుల్‌ అన్నారు. ఈ స్కామ్‌ ప్రతి భారతీయుడికి అవమానకరమని, ఈ అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రధానిని కోరుతున్నానని చెప్పారు. కాగా చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల వాడకాన్ని నిలిపివేయాలని ఐసీఎంఆర్‌ రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కిట్స్‌పై ఫలితాలు సవ్యంగా రావడంలేదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. ఈ కిట్స్‌ను చైనాకు తిప్పిపంపాలని రాష్ట్రాలను ఐసీఎంఆర్‌ ఆదేశించింది.

చదవండి : విస్తృత పరీక్షలే ఆయుధం: రాహుల్‌

మరిన్ని వార్తలు