కోవిడ్‌-19పై మభ్యపెడుతున్నారు : రాహుల్‌

19 Jul, 2020 15:58 IST|Sakshi

వాస్తవాలను దాస్తే భారీ మూల్యం 

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పాలక బీజేపీ వాస్తవాలను దాచి అసత్యాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. కరోనా మరణాలు, జీడీపీ, చైనాతో ప్రతిష్టంభన వంటి అంశాలపై బీజేపీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందని దుయ్యబట్టారు. టెస్టింగ్‌లను తగ్గిస్తూ, మరణాలపై తప్పుడు వివరాలను ఇస్తున్నారని, నూతన పద్ధతిలో జీడీపీని లెక్కిస్తున్నారని కాంగ్రెస్‌ నేత పేర్కొన్నారు. చైనా దూకుడుపైనా ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని ఆరోపించారు. కీలకాంశాలపై పాలకులు భ్రమల్లో విహరిస్తే భారత్‌ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌లో మొత్తం కేసుల శాతం, పదిలక్షల మందిలో మరణాల సంఖ్య తక్కువగా ఉండటంపై సందేహం వ్యక్తం చేసిన ఓ వెబ్‌సైట్‌ కథనాన్ని రాహుల్‌ తన ట్వీట్‌తో పాటు పోస్ట్‌ చేశారు. చైనాతో సరిహద్దు వివాదంలోనూ భారత్‌ తీరు సరిగ్గాలేదని, దీనికి భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కోవిడ్‌-19, లడఖ్‌ ప్రతిష్టంభన, వలస కార్మికుల దుస్ధితి, ఆర్థిక సంక్షోభం సహా పలు అంశాలపై బీజేపీ ప్రభుత్వంపై గత కొద్దివారాలుగా రాహుల్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

చదవండి : సాయుధులుగానే ఉన్నారు

మరిన్ని వార్తలు