స్నానం చేస్తే కొడతారా..?

15 Jun, 2018 14:46 IST|Sakshi
కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని జల్గావ్‌లో దళిత బాలురపై గ్రామస్తుల పైశాచిక దాడిని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండించారు.మానవత్వం తన ఉనికిని కాపాడుకునేందుకు సమస్యలు ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆరెస్సెస్‌ విషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళమెత్తాలని పిలుపు ఇచ్చారు. మహారాష్ట్రలో ఇద్దరు బాలురను కర్రలతో కొడుతున్న వీడియోను రాహుల్‌ షేర్‌ చేస్తూ..దళిత చిన్నారులు చేసిన నేరం గ్రామానికి చెందిన బావిలో స్నానం చేయడమేనన్నారు.

ఆరెస్సెస్‌, బీజేపీల విషపూరిత రాజకీయాలు, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మనం గొంతెత్తకుంటే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. జల్గావ్‌కు చెందిన ముగ్గురు దళిత బాలురు గ్రామ బావిలో ఈత కొట్టడంపై ఆగ్రహించిన స్ధానికులు వారిని నగ్నంగా ఊరేగిస్తూ దారుణంగా కొట్టిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపిన విషయం తెలిసిందే.

జూన్‌ 10న జరిగిన ఈ ఘటన దళిత బాలురను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియోలు వైరల్‌ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను పలు దళిత సంఘాలు, విపక్ష కాంగ్రెస్‌, పాలక బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దోషులపై ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు