రాహుల్‌తో మన మాట

3 Feb, 2019 04:17 IST|Sakshi
విద్యార్థులతో ముచ్చటిస్తున్న రాహుల్‌

కొత్త కార్యక్రమం ప్రారంభించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు  

న్యూఢిల్లీ: ‘అప్నీ బాత్‌ రాహుల్‌ కే సాథ్‌’ (రాహుల్‌తో మన మాట) పేరుతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిని కలుసుకుని మాట్లాడి, దేశ భవిష్యత్తు, ప్రభుత్వాల పని, సమాజంలో రావాల్సిన మార్పులు తదితర విషయాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తొలిదశలో భాగంగా ఢిల్లీ, అస్సాం, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఓ చైనీస్‌ రెస్టారెంట్‌లో రాహుల్‌ను కలిశారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోను బ్రెయిలీ లిపిలోనూ విడుదల చేయడం, ఎల్జీబీటీక్యూలపై వివక్షను రూపుమాపేందుకు లింగ–తటస్థ మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం, విద్యావ్యవస్థలో అసమానతలను దూరం చేయడం, సమాజంలో కుల వివక్షను నిర్మూలించడం తదితర విషయాలపై విద్యార్థులు సలహాలిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతో సమావేశమని చెప్పి తమను తీసుకొచ్చారనీ, పార్టీ అధ్యక్షుడే రావడంతో తామంతా అవాక్కయ్యామని ఈ భేటీలో పాల్గొన్న ఓ విద్యార్థి చెప్పాడు. రాహుల్‌ సామాన్యులతో బాగా కలిసిపోయే వ్యక్తి అనీ, తాము చెప్పినవన్నీ ఆయన సావధానంగా వినడమేగాక, మేనిఫెస్టోలో చేర్చేందుకు కూడా ప్రయత్నిస్తామన్నారని విద్యార్థులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు