అత్యాచారాలకు రాజధానిగా భారత్‌: రాహుల్‌

7 Dec, 2019 17:48 IST|Sakshi

వయనాడ్‌(కేరళ): దిశ, ఉన్నావ్ హత్యోదంతాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు రాజధానిగా భారత్ మారిపోతోందని వ్యాఖ్యానించారు. శనివారం వయనాడ్‌లో పర్యటించిన ఆయన దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలపై తీవ్రంగా స్పందించారు. అత్యాచార ఘటనలకు ప్రపంచ దేశాలన్నింటికీ.. భారతదేశం రాజధానిగా మారిందన్నారు. అత్యాచారాలపై భారత్‌ను అంతర్జాతీయ మీడియా ప్రశ్నిస్తోందన్నారు.

దేశంలో బీజేపీ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కొంతమంది వ్యక్తులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. హింస, విచక్షణారహిత విధానాన్ని విశ్వసించే వ్యక్తి దేశాన్ని పాలిస్తున్నారని ఫలితంగా దేశంలో హింస పెరిగిపోతోందని పేర్కొంటూ ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా ప్రధాని మోదీ ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు