చౌకీదార్‌ మేలుకో...మౌనం వీడు

13 Apr, 2018 10:38 IST|Sakshi
కథువా, ఉన్నావో అత్యాచార సంఘటనలకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ గొప్ప, గొప్ప మాటలు చెప్పిన ప్రధాని మోదీ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఇంత భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్‌ అధినేత  రాహుల్‌ గాంధీ. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆయన గురువారం అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశంలో వరుసగా జరుగుతున్న అత్యాచార దారుణాలు బీజేపీని ఇరుకున​ పెట్టడానికి ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. జమ్ము - కాశ్మీర్‌లోని కథువా గ్రామానికి చెందిన ఒక ఎనిమిదేళ్ల బాలిక అసిఫాను మృగాళ్లు మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులు గ్యాంగ్‌ రేప్‌ చేసి అత్యంత క్రూరంగా బండరాళ్లతో మోది చంపారు.

మరో రాష్ట్రం యూపీలో స్వయంగా అధికారీ పార్టీ ఎమ్మెల్యేనే 16ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. చేసిన పనికి సిగ్గుపడక ‘తక్కువ కులం’ వారు అంటూ నోరుపారేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలపై నిరసన తెలుపుతూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఇండియా గేట్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలంటూ  రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు వందాలాది మంది ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్ధరాత్రి ఇండియా గేట్‌ వద్దకు వచ్చి తమ మద్దతు తెలిపారు. శాంతియుతంగా, నిశ్శబ్దంగా జరిగిన ఈ ర్యాలీలో  రాహుల్‌ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, మరికొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం ఐదేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటనను గుర్తుచేస్తుంది. ఆ సమయంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ముందు ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

గురువారం అర్ధరాత్రి నిర్వహించిన ర్యాలీ సందర్భంగా  రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలను అత్యాచారం చేసి, చంపేశారు. ఈ సంఘటన పట్ల దేశమంతా ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఇది రాజకీయ అంశం కాదు, దేశానికి సంబంధించిన అంశం. ప్రభుత్వం దీనిపై తగు చర్య తీసుకోవాలి. ప్రధాని మోదీ ఇచ్చిన ఆడపిల్లలను రక్షించుకుందాము అనే నినాదం చాలా బాగుంది, కానీ దాన్ని అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రధానిగా ఇది మీ బాధ్యత అన్నారు.

స్పందించిన ఇతర ప్రముఖులు..

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ అజాద్‌ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ అంశం కాదు. ప్రభుత్వం నిద్రపోయినప్పుడు, ఈ దేశ చౌకీదారు (వాచ్‌మెన్‌) అయిన ప్రధాని నిద్రపోయినప్పుడు ఆయనను మేల్కొలిపే బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుంది’ అన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ తనను తాను దేశానికి వాచ్‌మెన్‌గా వర్ణించుకున్నారు. ఆ విషయాన్ని ఈ ర్యాలీ సందర్భంగా ఆజాద్‌ గుర్తుచేశారు. ఈ ఘటనపై బాలీవుడ్‌ ప్రముఖులు తమ ఆవేదనను, ఆ‍గ్రహన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేశారు. హీరో అక్షయ్‌ కుమార్‌, దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌, నటి సోనమ్‌ కపూర్‌, ఫర్హాన్‌ అక్తర్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులుగా తాము విఫలమయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన ఒకే ఒక్క బీజేపీ నాయకుడు వీకే సింగ్‌. అసిఫాకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఖండిస్తూ ‘అసిఫా విషయంలో మేము మనుషులుగా విఫలం అయ్యాము, కానీ ఆమెకు న్యాయం చేసే విషయంలో మాత్రం విఫలం అవ్వము’ అన్నారు.

 సంఘటన వివరాలు...

బఖేర్వాల్‌ తెగకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక అసిఫాను గత జనవరి 10న కొందరు దుండగులు నమ్మించి అడవికి తీసుకుపోయి అక్కడ ఆమెపై దౌర్జన్యం చేసి, మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగురోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి రాళ్లతో కొట్టి చంపారు. ఈ దురంతంలో పాలుపంచుకున్నవారిలో ఇద్దరు మైనర్లు, మరో ఇద్దరు పోలీసు విభాగానికి సహకరించే ప్రత్యేక పోలీసు అధికారులు(ఎస్‌పీఓలు) ఉన్నారు. బాలిక గురించి ఆమె కుటుంబసభ్యులు వెదు కుతున్న సమయానికి స్థానిక పోలీసుల్లో కొందరికి ఆమెను ఎక్కడ బంధించారో తెలుసు. అయినా వారు రక్షించేయత్నం చేయలేదు.

జనవరిలో ఈ ఉదంతం జరిగాక తొలుత మైనర్‌ను అరెస్టు చేసిన ప్పుడు దర్యాప్తు సక్రమంగా జరగడంలేదని, దీన్ని క్రైం బ్రాంచ్‌కు అప్పగించాలని  మెహబూబా కేబినెట్‌లోని ఇద్దరు బీజేపీ మంత్రులు డిమాండ్‌ చేశారు. క్రైంబ్రాంచ్‌ దర్యాప్తు ప్రారంభమయ్యాక ఇతర నిందితుల గుట్టు రట్టు కావడం మొదలయ్యే సరికి దీన్ని సీబీఐకి అప్పగించాలంటూ స్వరం మార్చారు. దర్యాప్తు కోసం నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలోనే ఒక మంత్రి అంత చిన్న వయసున్న వారిని ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులపై విరుచుకుపడ్డాడు. మరో మంత్రి ఒక బాలిక మృతిపై ఇంత రాద్ధాంతం చేస్తారా... ఎంతమంది మహిళలు ఈ ప్రాంతంలో చనిపోవడంలేదని నిలదీశాడు.

మరిన్ని వార్తలు