కష్టపడి పాక్‌ను బోనులో పెడితే..!

3 Mar, 2016 02:14 IST|Sakshi
కష్టపడి పాక్‌ను బోనులో పెడితే..!

కప్పు టీ కోసం విడిపించేశారు; ప్రధానిపై రాహుల్ ధ్వజం
♦ యూపీఏ కష్టాన్ని వృథా చేశారని విమర్శ
♦ ప్రభుత్వ బ్లాక్‌మనీ పథకాన్ని ‘ఫెయిర్ అండ్ లవ్లీ స్కీం’ అని ఎద్దేవా
 
 న్యూఢిల్లీ: ‘26/11 ఉగ్రదాడుల అనంతరం యూపీఏ ప్రభుత్వం ఆరేళ్లు కష్టపడి పాకిస్తాన్‌ను చిన్న బోనులో బంధించింది. ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిని చేసింది. నిఘా వర్గాలు, దౌత్యవేత్తలు, విపక్ష నేతల సంప్రదింపులతో యూపీఏ ఆ ఘనత సాధించగలిగింది. కానీ ప్రధాని మోదీ ఏం చేశారు? లాహోర్‌లో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఒక కప్పు టీ కోసం పాక్‌ను ఆ బోను నుంచి విడిపించేశారు.  ఒక్క చేత్తో ఆరేళ్ల యూపీఏ కష్టాన్ని బూడిదపాలు చేశారు’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ‘కశ్మీర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిం చాం.

స్వయంసహాయ బృందాల ద్వారా ఉ పాధి అవకాశాలు కల్పించాం. మొత్తంగా ఆ రాష్ట్రంలో వేర్పాటువాదం వెన్ను విరిచాం. ఇప్పుడు ఆ కష్టాన్నంతా ఎలాంటి ముందు చూపు లేకుండా ప్రధాని నాశనం చేశారు’ అని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్‌సభలో ప్రసంగి స్తూ.. మోదీ సర్కారుపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు, చణుకులు, చురకలతో ఆద్యంతం ప్రసంగాన్ని ఆసక్తికరంగా కొనసాగించారు. ‘కనీసం మీ మంత్రివర్గ సహచరులనైనా సంప్రదించండి’ అని వ్యంగ్యంగా సూచించారు.  కీలకాంశా ల్లో ప్రతిపక్షాన్ని సంప్రదించాలని సూచిస్తూ ‘విపక్షం మీకు శత్రువు కాదు. మిమ్మల్ని అసహ్యించుకోదు. దేశ ప్రయోజనాల కోసం మమ్మల్నీ సంప్రదించండి. మా మాటలనూ వినండి’ అని హితవు చెప్పారు. 2015లో నా గా వేర్పాటువాద సంస్థతో కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి హోంమంత్రి రాజ్‌నాథ్‌కు సైతం తెలియదన్నారు. ‘మోదీ లా హోర్ పర్యటన గురించి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలియకపోయిఉండొచ్చ’ న్నారు. ‘ప్రధాని ఒక్కడే దేశాన్ని నడపలేరు. దేశమంటే ప్రధాని ఒక్కరే కాదు’ అన్నారు.

 ఫెయిర్ అండ్ లవ్లీ స్కీం: బ్లాక్‌మనీకి సంబంధించి ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన పథకాన్ని ‘ఫెయిర్ అండ్ లవ్లీ స్కీం’గా రాహుల్ ఎద్దేవా చేశారు.  ‘మన ఆర్థిక మంత్రి బడ్జెట్లో  కొత్తగా ఫెయిర్ అండ్ లవ్లీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అవినీతితో దేశాన్ని దోచుకున్న వారంతా ఆ పథకం ద్వారా ఆ బ్లాక్‌మనీని వైట్‌గా చేసుకోవచ్చు. ఎవరికీ శిక్షలుండవు. ఎవరూ జైళ్లకెళ్లరు’ అన్నారు. జేఎన్‌యూ వివాదం, కోర్టు లో విద్యార్థులు, జర్నలిస్టులపై లాయర్ల  దా డులకు సంబంధించి ప్రధాని కనీసం స్పందించకపోవడాన్ని రాహుల్ తప్పుబట్టారు. ‘మీరు జేఎన్‌యూ వెంట ఎందుకు పడ్డారు? అందులో దళితులు, ఆదివాసీలు చదువుకుంటున్నారు కనుకనా! వారు అభివృద్ధి చెందడం మీకిష్టం లేదు. కానీ మేమలా జరగనివ్వం. జేఎన్‌యూను అణచేయడాన్ని సహించం’ అని తేల్చిచెప్పారు. ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ తల్లిని పరామర్శించే సమ యం కూడా లేదా? అని మోదీని ప్రశ్నించా రు. ‘26/11 దాడుల సమయంలో ముంబైకి వెళ్లొద్దని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎంత కోరినా నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ వినలేదు. దానివల్ల ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్ అస్తవ్యస్తమై, అమాయకులు చనిపోయారు’ అని గుర్తు చేశారు.

 రాజ్యసభలో: రాజ్యసభలోనూ ప్రభుత్వంపై విపక్షం విరుచుకుపడింది. ప్రభుత్వం  ప్రకటించిన పథకాలు, పాక్‌తో మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు అనుసరిస్తున్న విదేశాంగ విధానం సత్ఫలితాలను ఇస్తాయన్న ఆశ తమకు లేదని సభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.
 
 పార్లమెంటు సమాచారం
► దేశంలోని అన్ని తరహా పరిశ్రమల్లో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు చట్ట సవరణ చేసినట్లు కేంద్ర  కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం రాజ్యసభలో చెప్పారు.  
► ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్)పై పన్నుకు సంబంధించి ఆరోపణలు రావడంతో కేంద్రం కొంత వెనక్కి తగ్గింది. దీనిపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తరువాతే ముందుకు వెళతామని రాజ్యసభలో పేర్కొంది.
► నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చెందిన డాక్యుమెంట్లు భారత్‌కు తెప్పించేందుకు జపాన్, రష్యా, యూకేలతో చర్చలు జరుపుతున్నామని కేంద్రం తెలిపింది.
► దేశంలో మరింత మందికి గ్యాస్ కనెక్షన్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో పేర్కొన్నారు.  
► రైల్వే రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేందుకు గాను ప్రపంచ బ్యాంకు సాయం అర్థించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి బుధవారం సురేశ్ ప్రభు లోక్‌సభలో చెప్పారు.
► హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్ లాభాల్లో ఉన్న క్రమరాహిత్యాన్ని తొలగించే ‘హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల (వేతనాలు, సేవా సర్వీసులు) సవరణ బిల్లు 2015’కు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు