కార్పొరేట్ల రుణం తీర్చుకోడానికే!

20 Apr, 2015 02:44 IST|Sakshi
కార్పొరేట్ల రుణం తీర్చుకోడానికే!
  • భూసేకరణ బిల్లుపై రాహుల్ ధ్వజం
  • సాక్షి, న్యూఢిల్లీ: కార్పొరేట్ల రుణం తీర్చుకునేందుకే ప్రధాని నరేంద్రమోదీ భూ సేకరణ బిల్లును తీసుకువచ్చారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను కాలరాసేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా.. రైతుల పక్షాన తాను ముందుండి పోరాడుతానన్నారు. రాంలీలా మైదానంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కిసాన్ మహా ర్యాలీ(సభ)నుద్దేశించి మాట్లాడుతూ మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. రెండు నెలల సెలవు అనంతరం రెండురోజుల క్రితమే ఢిల్లీ తిరిగొచ్చిన రాహుల్ నూతనోత్సాహంతో కనిపించారు. అకాల వర్షాలతో ఇప్పటికే దెబ్బతిని ఉన్న రైతులపై పుండుపై కారంలా ప్రభుత్వం భూ బిల్లును తీసుకువస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ విమర్శించారు.
     
    ‘యువతరం గుండె చప్పుడ’ంటూ రాహుల్‌ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. 2013లో తాము తెచ్చిన భూసేకరణ చట్టాన్ని బలహీన పర్చే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం అందులో సవరణలు చేస్తోందని ఆక్షేపించారు. లోక్‌సభ ఎన్నికలు, ఆ తరువాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో చతికిలపడ్డ కాంగ్రెస్‌లో కొత్త జవసత్వాలు నింపేలా సభ విజయవంతమైంది. దేశం నలుమూలల నుంచి భారీగా వచ్చిన రైతులు, కూలీలు, కార్యకర్తలు పార్టీ నేతల్లో నూతనోత్సాహం నింపారు. భూబిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సభ విజయవంతమైంది.
     
    భూములు లాక్కోవడమే మోదీ మోడల్
    సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘బడా పారిశ్రామిక వేత్తల నుంచి కోట్లాది రూపాయలు రుణంగా తీసుకుని, వాటిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుని మోదీజీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు మీ భూములు లాక్కొని ఆ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం ద్వారా ఆ రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. మొదట సాగునీరు అందించకుండా, సబ్సిడీలో ఎరువులు దొరకనివ్వకుండా, గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిమ్మల్ని బలహీనులుగా మారుస్తారు. ఆ తరువాత మీ భూముల్ని లాక్కుని తన కార్పొరేట్ మిత్రులకు బహుమతిగా ఇస్తారు. అదే ప్రధాని ప్రణాళిక.
     
    గుజరాత్‌లో అమలు చేసిన ఈ ప్లాన్‌ను ఇప్పుడు దేశవ్యాప్తం చేయాలనుకుంటున్నారు. పునాదులను బలహీనపర్చి.. భవనానికి ప్రకాశవంతమైన రంగులేసి, వెలిగిపోతున్నామంటూ ప్రపంచానికి చూపాలనుకుంటున్నారు. లోలోపల భవనం బలహీనమవుతున్న విషయాన్ని మాత్రం మరుగుపరుస్తున్నారు. ఇదే మోదీ మోడల్’ అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. రైతులు, వ్యవసాయ కూలీల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని, వారి ప్రయోజనాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోబోదన్నారు. ‘రైతులు దేశానికి శక్తినిస్తున్నారు. హరిత విప్లవం దేశానికి ఆహారాన్ని ఇచ్చింది. రైతుల చెమట చుక్కలతో ఈ దేశం అభివృద్ధి చెందింది. ఇప్పుడా రైతులు తమ భూములను ఎప్పుడు, ఎవరు లాక్కుంటారోనని భయపడుతున్నారు. తమ పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలా? అని ఆందోళన చెందుతున్నారు’ అని రైతుల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. భూములు బంగారం కన్నా విలువైనవన్నారు.
     
    అభివృద్ధి పేరుతో రైతుల పొట్టగొట్టొద్దు
    భూసేకరణ చట్టంలో రైతులకు సాధికారత కల్పించేలా యూపీఏ పొందుపర్చిన నిబంధనలను మోదీ సర్కారు తొలగించాలనుకుంటోందని రాహుల్ ధ్వజమెత్తారు. ‘అభివృద్ధి అవసరమే..  రైతులూ అవసరమే. అభివృద్ధి పేరుతో రైతుల పొట్టగొట్టిపారిశ్రామికవేత్తల కడుపునింపే ప్రయత్నాలను అడ్డుకుని తీరుతాం’ అని అన్నారు. ఒడిశాలోని నియంగిరి హిల్స్‌లో నిర్మించ తలపెట్టిన పారిశ్రామిక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఉద్యమానికి బాసటగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించారు. తమ భూములు లాక్కొంటే నక్సలైట్లలో చేరుతామంటూ 400 మంది స్థానిక యువకులు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

    నియంగిరిలో గెలిచినట్లే ఈ భూబిల్లు విషయంలోనూ గెలుస్తామన్నారు. నియంగిరి, భట్టాపర్సాల్ తరహా ఉద్యమాలు చేయాలని రైతులకు సూచించారు. వారికి బాసటగా నిలుస్తానన్నారు.  మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పేరుతో రైతుల భూములను  లాక్కుంటున్నారని విమర్శించారు. కెనడాలో గత ప్రభుత్వాల పై మోదీ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని వ్యాఖ్యానించారు. ప్రధాని స్థాయి వ్యక్తులు చేయాల్సిన వ్యాఖ్యలు అవి కావన్నారు. ‘భార తదేశ ప్రజల శక్తి ఆయనకు అర్థం కాదు. యాభై ఏళ్లుగా ఈ దేశాన్ని నిర్మించిన మీ చెమట, రక్తం విలువ ఆయనకు తెలియదు. ఆయన మాటలు ఆయనకు గానీ, ప్రధాన మంత్రి పదవికిగాని శోభనివ్వవు’ అన్నారు.
     
     రైతులకు అన్యాయం జరగనివ్వం
     సభనుద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఈ సభ మోదీ సర్కారుకు ఒక సందేశం కావాలన్నారు. రైతులకు అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు.  రైతు కుటుంబమంతా రాత్రి, పగలు తేడా లేకుండా పొలాల్లోనే కష్టపడే సమయమిదని తనకు తెలుసని, అయినా భారీ సంఖ్యలో ఈ సభకు హాజరైనందుకు కృతజ్ఙతలు తెలుపుతున్నానన్నారు. ‘రైతులు, వ్యవసాయ కూలీలు, పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదు అన్న సందేశాన్ని దేశ ప్రధానికి గట్టిగా పంపేందుకే మనమంతా ఈ రోజు ఇక్కడ కలిశాం’ అన్నారు. ‘అధికారంలో లేకున్నా  రైతుల పక్షాన పోరాడడంలో వెనకాడం. రైతుల గొంతుకను పార్లమెంట్‌లో వినిపిస్తాం’ అని అన్నారు.  రైతులకు సాధికారత కల్పించేందుకు భూ సేకరణ చట్టంలో తాము పొందుపర్చిన నిబంధనలన్నింటినీ మోదీ ప్రభుత్వం తొలగించాలనుకుంటోందని విరుచుకుపడ్డారు. ‘అందరితో కలిసి..అందరి అభివృద్ధి’ అని చెప్పే మోదీకి రైతులు, కూలీలు ఆ అందరిలో ఒకరిగా కనిపించడం లేదా? అని తీవ్రస్వరంతో ప్రశ్నించారు. ఒక్క రైతునూ ఆత్మహత్య చేసుకోనివ్వబోమన్న బీజేపీ ఎన్నికల హామీ ఏమైందని అడిగారు.

మరిన్ని వార్తలు