సీడబ్ల్యూసీని రద్దు చేసిన రాహుల్‌

17 Feb, 2018 03:11 IST|Sakshi

మార్చి 16 లేదా 17న ఢిల్లీలో ప్లీనరీ?

న్యూఢిల్లీ: సోనియా హయాంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)ని ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ రద్దు చేశారు. దాని స్థానంలో 34 మంది సభ్యులుండే తాత్కాలిక స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ త్వరలో నిర్వహించే పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. సీడబ్ల్యూసీ సభ్యులందరూ స్టీరింగ్‌ కమిటీలోనూ ఉన్నారు. శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న అమరిందర్‌ సింగ్, విలాస్‌ ముత్తెంవార్, ఆర్‌కే ధావన్, శివాజీరావ్‌ దేశ్‌ముఖ్,, ఎంవీ రాజశేఖరన్, మొహ్‌సినా కిద్వాయితోపాటు ప్రత్యేక ఆహ్వానితులను కమిటీ నుంచి మినహాయించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో కూడిన స్టీరింగ్‌ కమిటీ శనివారం సమావేశమై ప్లీనరీ షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ నియామకాన్ని ప్లీనరీ లాంఛనంగా ఆమోదించటంతో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లవుతుంది. ప్లీనరీ మార్చి 16 లేదా 17 తేదీల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్లీనరీ ముగిశాక తిరిగి కొత్త సీడబ్ల్యూసీ ఏర్పాటవుతుంది. దీనిని ప్లీనరీలో కానీ, ఆ తర్వాత కానీ ఎన్నుకుంటారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీలోని 25 మంది సభ్యుల్లో ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ కాకుండా 12 మందిని ఎన్నుకుంటారు.

>
మరిన్ని వార్తలు