రాహుల్‌ గాంధీ భావోద్వేగ ట్వీట్‌

9 Nov, 2019 11:21 IST|Sakshi

న్యూఢిల్లీ : తనకు ఇన్నాళ్లు రక్షణ కవచంలా నిలిచిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) సిబ్బందికి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ కృతఙ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ ప్రయాణంలో వారితో పెనవేసుకున్న బంధం తనకు ఎన్నో విషయాలు నేర్పిందన్నారు. తనను, తన కుటుంబాన్ని రక్షించేందుకు అంకిత భావంతో, నిర్విరామ కృషి చేసిన అధికారులను అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు అని సంభోదించారు. వారితో ప్రయాణం తనకు గర్వకారణమని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు.. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లకు బిగ్‌ థ్యాంక్యూ అని రాహుల్‌ గాంధీ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గాంధీ కుటుంబాన్ని ఎస్పీజీ నుంచి సీఆర్‌పీఎఫ్‌ బలగాల సంరక్షణలోని జడ్‌ ప్లస్‌ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. ఇక దాదాపు 28 ఏళ్లుగా గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను.. వారికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఇకపై రాష్ట్రపతి, దేశ ప్రధానికి భద్రతకై ఎస్పీజీలోని సుమారు 3 వేల మంది సైనికులను వినియోగించనుంది. కాగా 1991లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. గాంధీ కుటుంబానికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే భద్రత తొలగించినట్లు అధికారులు స్పష్టంచేశారు. దీంతో ఎస్పీజీలోని సుమారు  3 వేల మంది సైనికులు కేవలం ప్రధానికే భద్రత కల్పించనున్నారు. కాగా కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కక్షాపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా