రాహుల్‌కు ధిక్కార నోటీసు

24 Apr, 2019 02:49 IST|Sakshi

రఫేల్‌ తీర్పు వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినా పట్టించుకోని సుప్రీం

న్యూఢిల్లీ: రఫేల్‌ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. రాహుల్‌ తన అఫిడవిట్‌లో విచారం వ్యక్తం చేసినప్పటికీ తోసిపుచ్చింది. కాపలాదారే దొంగ(చౌకీదార్‌ చోర్‌ హై) అంటూ మోదీని తాము తప్పుపట్టినట్లుగా తమ తీర్పును ఆయన తప్పుగా ఆపాదించారని పేర్కొంది. ఈ నెల 30వ తేదీన రఫేల్‌పై రివ్యూ పిటిషన్‌తోపాటే, కోర్టు ధిక్కార పిటిషన్‌పైనా విచారణ జరుపుతామని తెలిపింది. కోర్టు ఉత్తర్వుల మేరకు రాహుల్‌ సోమవారం వివరణ ఇచ్చారు.

అందులో ఆయన..‘రాజకీయ ప్రచారం వేడిలో కోర్టు తీర్పుపై తప్పుడు ప్రకటన చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. నా ప్రకటనను బీజేపీ నేతలు వక్రీకరించారు’ అని అన్నారు. ఈ అఫిడవిట్‌పై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. రాహుల్‌ తన వివరణలో ‘విచారం’ అన్న మాటను బ్రాకెట్‌లో ఉంచటాన్ని ప్రస్తావించిన ధర్మాసనం..‘ఈ విషయంలో రాహుల్‌కు ధిక్కర నోటీసు జారీ చేయడం సరైందేనని భావిస్తున్నాం. అయితే, ఆయన వ్యక్తిగతంగా న్యాయస్థానానికి హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ నెల 30వ తేదీన రివ్యూ పిటిషన్లతోపాటే మీనాక్షి లేఖి కోర్టు ధిక్కార పిటిషన్‌పైనా విచారణ జరుపుతాం’ అని కోర్టు పేర్కొంది. 

ఆ నినాదాన్ని రాహుల్‌ ఆపబోరు: కాంగ్రెస్‌ 
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాపలాదారే దొంగ (చౌకీదార్‌ చోర్‌ హై) అన్న నినాదాన్ని తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ ఆపబోరని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఈ ప్రచారాన్ని రాహుల్, కాంగ్రెస్‌ పార్టీ మున్ముందు కూడా కొనసాగిస్తాయని  ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి తెలిపారు. వివాదానికి కోర్టు ముగింపు పలకాలని కోర్టును కోరారు.

మరిన్ని వార్తలు