మహిళను ఆలింగనం చేసుకున్న రాహుల్‌ గాంధీ

26 Nov, 2017 16:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక మహిళ ఆవేదన విని.. తట్టుకోలేక అనూహ్య రీతిలో ప్రతిస్పందించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.


అహ్మదాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌ గాంధీ, అహ్మద్‌ పటేల్‌ సహా మరికొందరు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు తమ కష్టాలను రాహుల్‌గాంధీకి వివరిస్తున్నారు. ఈ సమయంలో.. రంజనా అశ్వతి అనే మహిళ లేచి తన కష్టాలను రాహుల్‌గాంధీకి వివరించడం మొదలు పెట్టారు. ‘నేను 1994 నుంచి పార్ట్‌ టైమ్‌ టీచర్‌గా కెరీర్ మొదలు పెట్టాను. అప్పట్లో నాకు రూ. 2500 జీతం ఇచ్చేవారు. ప్రస్తుతం రూ. 12000 వేలు జీతం వస్తోంది. ప్రతి మహిళకు ప్రసూతి సెలువు తప్పక ఇస్తారు. అయితే ఈ ప్రభుత్వం నాకు ప్రసూతి సెలవు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది’’ అని ఉద్వేగంతో చెప్పారు.


అప్పటివరకూ వేదిక మీద నిలబడి ఆమె బాధలు వింటున్న రాహుల్‌ గాంధీ ఒక్కసారిగా వేదిక దిగి వచ్చి.. ఆమెను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక చర్య.. పది మాటలకంటే ఎక్కువ ధైర్యాన్నిస్తుంది.. అని చెప్పారు. రాహుల్‌ గాంధీ ఆమెను ఆలింగనం చేసుకున్న సమయంలో సభలో ఉన్నవారంతా.. గట్టిగా చప్పట్లు కొట్టడం విశేషం.

ఒక మహిళ ఆవేదన విని.. తట్టుకోలేక స్పందించిన రాహుల్

మరిన్ని వార్తలు