రాహుల్ గాంధీకి మోదీ ఫోన్‌

27 Apr, 2018 18:52 IST|Sakshi
రాహుల్‌తో మోదీ కరాచలనం (ఫైల్‌ ఫొటో)

బెంగళూరు : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. గురువారం రాహుల్‌ గాంధీ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రాహుల్‌ ఓ విమానంలో బయలుదేరారు. ఉదయం 10.45 గంటలకు విమానంలోని ఆటోపైలెట్‌ మోడ్‌ ఒక్కసారిగా ఆగింది. దీంతో విమానం ఒక్కసారిగా గాల్లో పక్కకు ఒరిగిపోయి వేగంగా కిందకు జారిపోయింది. వెంటనే స్పందించిన పైలెట్‌ విమానాన్ని మాన్యువల్‌ మోడ్‌లోకి తీసుకొచ్చి హుబ్బలి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. 

ఈ ప్రమాదం అనంతరం  రాహుల్‌కు మొట్టమొదటగా ఫోన్ చేసింది ప్రధాని నరేంద్ర మోదీనేనని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తీరు, రాహుల్ బాగోగుల గురించి ఆరా తీశారని సమాచారం. రాహుల్‌కు జరిగిన ప్రమాద విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోలేదనడానికి ప్రధాని స్వయంగా రాహుల్‌కు ఫోన్ చేయడమే నిదర్శనమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. రాహుల్‌కు ఎస్‌పీజీ కమాండోస్‌తో హై లెవల్ సెక్యూరిటీ కల్పిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. 

ఈ ఘటన వెనుక కుట్ర దాగిఉండొచ్చని కాంగ్రెస్‌ అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై రాహుల్‌ అనుచరుడు కౌశల్‌ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కర్ణాటక డీజీపీ నీల్‌మణి ఎన్‌.రాజుకు లేఖ రాశారు.

మరిన్ని వార్తలు