పటీదార్లపై పట్టు కోసం..

27 Sep, 2017 01:42 IST|Sakshi

గుజరాత్‌లో రాహుల్‌ పర్యటన

భారీగా హాజరైన పటీదార్లు

జామ్‌నగర్‌: గుజరాత్‌లో బలమైన వర్గంగా ఉన్న పటీదార్ల మద్దతు కోసం రాహుల్‌ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వీరంతా బీజేపీకి ప్రతికూలంగా ఉన్నారు. దీంతో వీరిని కాంగ్రెస్‌వైపు తిప్పుకునేందుకు రాహుల్‌ యత్నిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం పటీదార్లు ఎక్కువగా ఉండే సౌరాష్ట్ర ప్రాంతంలో పర్యటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార పార్టీ అయిన బీజేపీపై మండిపడ్డారు.

కోటా కోసం ఆందోళన చేసిన సమయంలో పటీదార్లపై పెట్టిన వేధింపులను రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవడం సిగ్గుచేట్టన్నారు. ‘‘సర్దార్‌ను మన దేశానికి అందించింది మీరే. మీ(పటీదార్ల)పై బీజేపీ అట్రాసిటీ కేసులు మోపింది. బుల్లెట్లను కూడా సంధించింది. కాంగ్రెస్‌ అలా ఎప్పుడు చేయలేదు. అన్ని కులాలు కలిసి ఉండేలా ఏం చేయాలో మాకు మాత్రమే తెలుసు’’అని అన్నారు. అభివృద్ధి అనేది ఇప్పుడు క్రేజీగా మారిపోయిందని, కానీ అసలైన అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్నారు.

ధరోల్‌ నుంచి రాజ్‌కోట్‌ వరకు జరిగిన పర్యటనలో హర్దిక్‌ పటేల్‌ ఆధ్వర్యంలోని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పీఏఏఎస్‌) అందజేసిన ‘జై సర్దార్‌.. జై పటీదార్‌’ అని రాసి ఉన్న టోపీని రాహుల్‌ ధరించారు. రాహుల్‌ సమావేశాలకు పటీదార్లు భారీగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా రాహుల్‌ పర్యటనకు తాము హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నామని హర్దిక్‌ పటేల్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ధరూల్‌తోపాటు లతిపూర్, ఓటలా గ్రామాల్లో రాహుల్‌ పర్యటించారు. గిమ్మిక్కు రాజకీయాలు చేయడంలో మోదీ సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు