దేశీ వెంటిలేటర్లపై విమర్శలా!

7 Jul, 2020 18:37 IST|Sakshi

వెంటిలేటర్ల నాణ్యతపై రగడ

సాక్షి, న్యూఢిల్లీ : పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి నాసిరకం వెంటిలేటర్లను కొనుగోలు చేయడం ద్వారా నరేంద్ర మోదీ సర్కార్‌ ప్రజాధనం వృధా చేసిందన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై వెంటిలేటర్‌ తయారీ సంస్థ అగ్వా హెల్త్‌కేర్‌ స్పందించింది. రాహుల్‌ గాంధీ డాక్టర్‌ కాదని, తమ ఉత్పత్తి గురించి ఆయనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాదం స్వయం సమృద్ధ భారత్‌కు అనుగుణంగా కరోనా వైరస్‌ చికిత్సకు పీఎం కేర్స్‌ నిధులతో స్వదేశీ కంపెనీ అగ్వా ద్వారా వెంటిలేటర్లను కొనుగోలు చేశారు. అయితే నాసిరకం వెంటిలేటర్లను కొనుగోలు చేశారని రాహుల్‌ గాంధీ ఈనెల 5న ట్వీట్‌ చేశారు. దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడంతో పాటు ప్రజాధనాన్ని నాసిరకం ఉత్పత్తుల కోసం ఖర్చు చేశారని దుయ్యబట్టారు.

కాగా రాహుల్‌ వ్యాఖ్యలపై అగ్వా హెల్త్‌కేర్‌ సహవ్యవస్ధాపకులు ప్రొఫెసర్‌ దివాకర్‌ వైష్‌ స్పందిస్తూ రాహుల్‌ డాక్టర్‌ కాదని..ఆయన చాలా తెలివైనవారని, కానీ ఈ ఆరోపణలు చేసే ముందు ఆయన తమ ఉత్పత్తులను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉండేదని అన్నారు. ఆయన వైద్యులను సంప్రదించి ఉండాల్సింది..ఏ రోగిపై ఏ ఆస్పత్రిలోనైనా తమ వెంటిలేటర్లపై సవివరంగా వాటి పనితీరును వివరించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. దేశీ ఉత్పత్తులను వాడే సందర్భాల్లో ఇలాంటి అసత్య ప్రచారం తెరపైకి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సైనిక పరికరాలను స్వదేశీ తయారీదారుల నుంచి కొనుగోలు చేసినప్పుడు సైతం ఇదే తరహా నెగెటివ్‌ సమీక్షలు వచ్చాయని గుర్తుచేశారు. చదవండి : ‘ఆయనకు కమీషన్లపైనే కన్ను’

10 లక్షల రూపాయల ఖరీదైన వెంటిలేటర్‌ పనితీరును కనబరిచే వెంటిలేటర్‌ను తాము లక్షన్నరకే సరఫరా చేస్తున్నామని దీన్ని అంతర్జాతీయ సరఫరాదారులు అంగీకరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. అందుకే తమను దెబ్బతీసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ వెంటిలేటర్‌ను ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి తిరస్కరించలేదని అన్నారు. ఇక ముంబైలోని జేజే ఆస్పత్రి, సెంట్‌జార్జ్‌ ఆస్పత్రుల్లో తమ వెంటిలేటర్లను థర్డ్‌ పార్టీ ద్వారా అమర్చారని, అవి సరిగ్గా అమర్చకపోవడంతో వైద్యులు వాటిని వాడలేకపోయారని వివరణ ఇచ్చారు. పెట్రోల్‌కు బదులుగా డీజిల్‌ వాడితే ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు