రాహుల్‌ గాంధీ నామినేషన్‌కు ఆమోదం

22 Apr, 2019 13:03 IST|Sakshi

అమేథీ (ఉత్తరప్రదేశ్‌): అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన నామినేషన్‌పై ఉత్కంఠకు తెరపడింది. రాహుల్‌ నామినేషన్‌ను ఆమెదించినట్టు రిటర్నింగ్‌ అధికారి సోమవారం వెల్లడించారు. రాహుల్‌ గాంధీ విద్యార్హతలు, పౌరసత్వంపై అనుమానాలను బీజేపీ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలిపే పత్రాలు రాహుల్‌ను బ్రిటిష్‌ పౌరుడిగా పేర్కొనగా, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్‌. చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న రాహుల్‌ గాంధీ, ఆ తర్వాత డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో ఎం.ఫిల్‌.చేసినట్లు చెప్పడంపై అమేథీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధ్రువ్‌లాల్‌ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామంపై బీజేపీ ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు, ధ్రువ్‌లాల్‌ లాయర్‌తో కలిసి ఢిల్లీలో మీడియాతో కూడా మాట్లాడారు. రాహుల్‌ను బ్రిటిష్‌ పౌరుడిగా పేర్కొనే బ్రిటిష్‌ పత్రాలను లాయర్‌ మీడియాకు చూపారు. రాహుల్‌ గాంధీ 1994లో డిగ్రీ చేసి, 1995లో ఎం.ఫిల్‌. చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారని, డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎం.ఫిల్‌ ఎలా సాధ్యమన్నారు. ఆయనకే తెలియాలని విమర్శించారు. పైగా డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌ లో ఎం.ఫిల్‌ చేసినట్టు ఓసారి, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో ఎం.ఫిల్‌ చేసినట్టు ఓసారి పేర్కొన్నారని విమర్శించారు. కాగా, రాహుల్‌ గాంధీ నామినేషన్‌ను పరిశీలించిన తర్వాత ఆమెదించినట్టు అమేథీ రిటర్నింగ్‌ అధికారి రామ్‌ తెలిపారు. ఎస్‌పీ–బీఎస్‌పీ–ఆర్‌ఎల్‌డీ కూటమి అమేథీలో తమ అభ్యర్థిని నిలపకపోవడంతో రాహుల్‌కు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్‌ బరిలోఉన్నారు.

మరిన్ని వార్తలు