కిటికీ ఎక్కి.. ఫెన్సింగ్‌ దూకి..

10 Aug, 2018 02:15 IST|Sakshi

రాహుల్‌గాంధీ తిప్పలు

కరుణ అంత్యక్రియల సందర్భంగా భద్రత కరువు

సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ సీఎం, దివంగత కరుణానిధి అంతిమయాత్రలో అగ్రనేతలు నానా అవస్థలు పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ సైతం కరుణ అంత్యక్రియల సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తొలుత కరుణ భౌతికకాయానికి అంజలి ఘటించేందుకు రాజాజీ హాల్‌ వద్దకు రాహుల్‌ చేరుకున్న సమయంలో అక్కడ వీఐపీల మార్గం కిక్కిరిసి ఉంది. దీంతో ముందుకు వెళ్లేదారిలేక రాహుల్‌ అక్కడే ఆగిపోయారు. ఇంతలో కొందరు సెక్యూరిటీ గార్డులు రాహుల్‌కు కుర్చీ ఏర్పాటుచేసి దారి క్లియర్‌ చేసేందుకు వెళ్లారు. ఇలా వెళ్లినవారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో రాహుల్‌ అక్కడే తచ్చాడారు. ఇలా దాదాపు 30 నిమిషాలు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రాహుల్‌ ఒక్కరే ఉన్నారని కేంద్ర హోంశాఖకు సమాచారం అందింది.  

కర్రల కింద నుంచి దూరి..
కరుణ అంత్యక్రియలు జరిగిన మెరీనా బీచ్‌కు చేరుకోవడానికీ రాహుల్‌ చాలా అవస్థలు పడ్డారు. అశేషజనవాహని మధ్య టీఎన్‌సీసీ చీఫ్‌ తిరునావుక్కరసర్, మాజీ ఎంపీ విశ్వనాథన్‌ తదితరులు రాహుల్‌ చుట్టూ వలయంగా ఏర్పడి ఆయన్ను అంత్యక్రియల వేదిక వద్దకు తీసుకెళ్లారు. అయినా జనం తాకిడితో రాహుల్‌ ఇబ్బంది పడ్డారు. కరుణ అంత్యక్రియలు ముగిశాక అక్కడ్నుంచి తిరిగివెళ్లడం రాహుల్‌కు మరో సవాలుగా మారింది. సమీపంలోని అన్నా స్మారక మందిరం పక్కనే ఉన్న పెయింట్‌ డబ్బాలపైకి ఎక్కి కిటీకి ఊచలు పట్టుకుని అవతలకు దూకారు. అక్కడ చిందరవందరగా ఉన్న పాత తుక్కు సామానుపైనే నడుచుకుంటూ ముందుకెళ్లారు.

అనంతరం అడ్డుగా కట్టిన కర్రల కింద నుంచి దూరి సమీపంలోని కారు వద్దకు చేరుకుని బతుకుజీవుడా.. అంటూ బయటపడ్డారు. కాగా, రాహుల్‌ భద్రత విషయంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యంపై చెన్నై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేరళ సీఎం విజయన్, కేరళ గవర్నర్‌ తదితరులు జనసందోహంలో చిక్కుకుపోయారు. చివరికి భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు.

మరిన్ని వార్తలు