భూటాన్‌ భారత్‌కు హ్యాండిస్తే ఎలా?

23 Feb, 2018 10:02 IST|Sakshi
రాహుల్‌ గాంధీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం సంక్షోభం సమసిసోయిందని సరిహద్దులో చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం లేదని విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా-భూటాన్‌లు సంధి చేసుకుంటే.. మధ్యలో భారత్‌ పరిస్థితి ఏంటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నిస్తున్నారు. 

గురువారం విదేశాంగ శాఖ ప్రతినిధులతో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ... డోక్లాం ప్రస్తావన తీసుకొచ్చారు. ‘సరిహద్దులో సమస్య సమసిపోయినట్లేనని చెబుతున్నారు. అలాంటప్పుడు చైనా-భూటాన్‌లు ఓ ఏకాభిప్రాయానికి వస్తే భారత్‌ పరిస్థితి ఏంటి? సమస్యసాత్మక ప్రాంతంలో ఆ రెండు పొరుగు దేశాలు భూ ఒప్పందం చేసుకునే అవకాశాలు లేకపోలేదు కదా!. ఆ దిశగా మీకు ఏమైనా సమాచారం ఉందా?’ అని విదేశాంగ కార్యదర్శిని ప్రశ్నించారు.

దీనికి స్పందించిన కార్యదర్శి విజయ్‌ గోఖలే.. అలాంటి అవకాశం ఉందని చెబుతూనే... పరిస్థితులు మాత్రం అందుకు సానుకూలంగా లేవని చెప్పటం కొసమెరుపు. అయితే ఈ విషయంలో భారత్‌ వెంటే తాము ఉంటామన్న సంకేతాలను భూటాన్‌ అందించిందని ఆయన వివరించారు. ఇక రక్షణ కార్యదర్శి సంజయ్‌ మిత్రా స్పందిస్తూ... పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. జూలై 2017 తర్వాత ఎలాంటి మోహరింపులు చోటు చేసుకోలేదని చెప్పారు. గత నెలలో శాటిలైట్‌ ఇమేజ్‌లు అనుమానాస్పద కట్టడాన్ని సూచించినప్పటికీ.. అది తమ సరిహద్దులోనే చేపడుతున్నట్లు చైనా వివరణ ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని ఈ ప్యానెల్‌.. సరిహద్దు సమస్యలు, రక్షణ చర్యలపై అధికారులతో భేటీలో సుదీర్ఘంగా చర్చించింది.

మరిన్ని వార్తలు