పార్లమెంట్‌లో కర్ణాటకం : రాహుల్‌ నినాదాలు

9 Jul, 2019 19:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక పరిణామాలపై పార్లమెంట్‌ హోరెత్తింది. పాలక జేడీఎస్‌-కాంగ్రెస్‌ సర్కార్‌ సంక్షోభంలో పడిన క్రమంలో ఆ రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మంగళవారం లోక్‌సభలో నినదించారు. 17వ లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మంగళవారం మధ్యాహ్నం రాహుల్‌ సభలోకి వస్తుండగా కాంగ్రెస్‌ సభ్యుడు అధీర్‌ రంజన్‌ ఛౌదరి కర్ణాటక అంశంపై మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని ఆరోపించారు.

ఈ దశలో స్పీకర్‌ ఓం బిర్లా జోక్యం చేసుకుని ఇదే అంశంపై సోమవారం సభలో చర్చ జరిగిందని లోక్‌సభ ఉప నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ ఆరోపణలపై స్పందించారని చెప్పారు. స్పీకర్‌ స్పందనతో సంతృప్తి చెందని సభ్యుడు తిరిగి  ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించారు. ఈ దశలో కాంగ్రెస్‌ సభ్యులు నిరంకుశత్వం నశించాలి, ప్రలోభపెట్టే రాజకీయాలు నిలిపివేయాలని కాంగ్రెస్‌ సభ్యులు పెద్దపెట్టున నినదించారు. కాంగ్రెస్‌ సభ్యుల నినాదాలతో రాహుల్‌ సైతం గొంతు కలిపారు. వారి నినాదాలను అందిపుచ్చుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులు చేబూని సభ మధ్యలోకి దూసుకువచ్చి నినాదాలతో హోరెత్తించారు.

>
మరిన్ని వార్తలు