రాహుల్‌కి సుప్రియా సూలే ‘గ్రీన్‌ ఛాలెంజ్‌’ 

20 Aug, 2019 08:51 IST|Sakshi

ఎంపీ సంతోష్‌ ద్వారా మిథున్‌రెడ్డికి, సుప్రియా సూలే నుంచి రాహుల్‌గాంధీకి..

సాక్షి, హైదరాబాద్‌: పచ్చదనం పెంచే లక్ష్యంతో మొదలుపెట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ కొత్త పుంతలు తొక్కుతూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీని చేరింది. గ్రీన్‌ ఛాలెంజ్‌ మొక్కల లక్ష్యం రెండు కోట్లకు చేరిన సందర్భంగా మరోసారి మొక్కనాటిన టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్, మరో నలుగురికి మొక్కలు నాటే ఛాలెంజ్‌ విసిరారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సినీనటుడు అఖిల్‌ అక్కినేని, జీఎమ్మార్‌ అధినేత మల్లికార్జున్‌రావులను మొక్కలు నాటాల్సిందిగా సంతోష్‌ కోరారు. వెంటనే దీనిని అంగీకరిస్తూ అఖిల్, మిథున్‌రెడ్డి, మల్లిఖార్జున్‌రావు ట్విట్టర్లో పోస్టు పెట్టారు.

మల్లిఖార్జునరావు స్వయంగా మొక్కను నాటి హరితహారంపై తన ఆకాంక్షను వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, తిరిగిరాగానే మొక్కలు నాటుతానంటూ, తన తరపున మరో ముగ్గురిని నామినేట్‌ చేశారు. అందులో మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూడా ఉన్నారు. మిథున్‌రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన సుప్రియా ఇవాళ తన నియోజకవర్గం పరిధిలోని జిల్లా పరిషత్‌ స్కూల్లో మొక్కలు నాటారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని తాను నామినేట్‌ చేస్తున్నట్లు సుప్రియ ట్వీట్‌ చేశారు. ఈవిధంగా గ్రీన్‌ ఛాలెంజ్‌ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని చేరింది. 

మరిన్ని వార్తలు