కులగోత్రాలు వెల్లడించిన రాహుల్‌

26 Nov, 2018 17:42 IST|Sakshi

జైపూర్‌ : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్‌లోని పుష్కర్‌ బ్రహ్మ ఆలయంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణుడిగా చెబుతున్న రాహుల్‌ గాంధీ తన గోత్రం ఏమిటో వెల్లడించాలని బీజేపీ కోరుతున్న క్రమంలో కాంగ్రెస్‌ చీఫ్‌ నుంచి ఆ వివరాలు వెల్లడయ్యాయి. బ్రహ్మ ఆలయంలో పూజల సందర్భంగా గోత్రం గురించి పూజారి అడిగిన మీదట తన గోత్రం దత్తాత్రేయ అని, తాను కౌల్‌ బ్రాహ్మణుడినని రాహుల్‌ బదులిచ్చారు.

పూజలో భాగంగా గాంధీ కుటుంబానికి చెందిన తన పూర్వీకుల వివరాలనూ ఆయన వెల్లడించారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో రాహుల్‌ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించిన సందర్భంలో రాహుల్‌ కులగోత్రాలపై బీజేపీ ప్రతినిధి సంబిట్‌ పాత్రా ప్రశ్నించారు. రాహుల్‌ జంధ్యం ధరిస్తే అది ఎలాంటిదో చెప్పాలని, ఆయన గోత్రం ఏంటో వెల్లడించాలని కోరారు.

ఇక బ్రహ్మ ఆలయంను సందర్శించే ముందు రాహుల్‌ సోమవారం ఉదయం అజ్మేర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాలో జియారత్‌ నిర్వహించారు. రాహుల్‌ వెంట రాజస్ధాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు