ఎవరినీ నిందించాల్సిన పనిలేదు: రాహుల్‌

12 Aug, 2019 19:47 IST|Sakshi

తిరువనంతపురం: ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేయాలనుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. అందరి సమిష్టి కృషితో కేరళ ప్రజల కష్టాలు తీర్చాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. గతేడాది రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన వరదల ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోకముందే వరణుడు మరోసారి కేరళను ముంచెత్తుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ దాదాపు 60 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఆదివారం నుంచి తన సొంత నియోజకవర్గం వయనాడ్‌లో పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తూ వారికి భరోసా ఇస్తున్నారు.

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ...ప్రకృతి విపత్తులకు ఎవరినీ నిందించాల్సిన పనిలేదన్నారు. వాటర్‌ బాటిళ్లు, చాపలు, ధోతీలు, పిల్లల దుస్తులు, సబ్బులు, తిను బండారాలు, డెటాల్‌, సానిటరీ న్యాప్‌కిన్స్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ తదితర సామాగ్రి పంపి వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా ఈద్‌ సందర్భంగా సహోదరులకు సహాయం చేసి పండుగ ప్రాశస్త్యాన్ని చాటుకోవాల్సిందిగా సూచించారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాహుల్‌ గాంధీ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆమేథీ(ఉత్తరప్రదేశ్‌) నియోజకవర్గంలో ఓటమి చెందగా.. కేరళలోని వయనాడ్‌లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఇక వరద సాయం కోసం రాహుల్‌ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు