రఫేల్‌ ప్రకంపనలు : మోదీపై రాహుల్‌ ఫైర్‌

2 Jan, 2019 15:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్‌ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస​ చీఫ్‌ రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో బుధవారం రఫేల్‌పై చర్చను ప్రారంభిస్తూ మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రఫేల్‌పై విపక్షాల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని ఎద్దేవా చేశారు. రఫేల్‌పై తనను ఎవరూ ప్రశ్నించలేరని ప్రదాని చెప్పడం సరైంది కాదని, దీనిపై దేశ ప్రజలంతా ఆయనను ప్రశ్నిస్తున్నారన్నారు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి రూ 1600 కోట్ల నూతన ధరపై రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసింది నిజం కాదా అని నిలదీశారు.

ఐఏఎఫ్‌ అధికారులు 126 విమానాలు కావాలని డిమాండ్‌ చేయగా వాటి సంఖ్యను 36కు ఎందుకు కుదించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఏఎన్‌ఐకి ప్రధాని ఇచ్చిన ఇంటర్వ్యూ ముందుగా సిద్ధం చేసిందేనన్నారు. ఇంటర్వ్యూలో 90 నిమిషాలు మాట్లాడిన ప్రదాని రఫేల్‌పై మాత్రం ఇప్పటికీ బదులివ్వడం లేదని ఆరోపించారు. రఫేల్‌కు సంబంధించిన ఫైళ్లనీ తన పడక గదిలో ఉన్నాయని గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ చెప్పారని ఆ రాష్ట్రమంత్రి విశ్వజిత్‌ రాణే చెబుతున్న ఆడియో క్లిప్‌ను సభలో ప్రదర్శిందుకు అనుమతించాలని రాహుల్‌ కోరారు. దీనికి స్పీకర్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం‍తో సభ వాయిదా పడింది.

జైట్లీ అభ్యంతరం..
రఫేల్‌ ఒప్పందంపై రాహుల్‌ వాదనను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తిప్పికొట్టారు. రఫేల్‌పై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెలువరించడంతో దిక్కుతోచని కాంగ్రెస్‌ ఆడియో టేప్‌ల అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. గోవా మంత్రి చెబుతున్నట్టు రూపొందిన ఆడియో క్లిప్‌ నకిలీదని జైట్లీ అన్నారు.రఫేల్‌పై మోదీ సర్కార్‌పై బురద చల్లేందుకు ఈ టేప్‌ను కాంగ్రెస్‌ తయారుచేసిందని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు