మోదీ వృద్ధుడయ్యారు..

7 Mar, 2017 01:34 IST|Sakshi
మోదీ వృద్ధుడయ్యారు..

► యూపీలో యువ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
► ఎన్నికల ప్రచారంలో రాహుల్‌


జౌన్ పూర్‌: ప్రధాని నరేంద్ర మోదీకి వయసు మీదపడిందని, అలసిపోయారంటూ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యంగ్యాస్రా్తలు సంధించారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కూటమి యువ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.

సోమవారం జౌన్ పూర్‌లో ఆయన మాట్లాడుతూ... తమ నేతృత్వంలోని యువ ప్రభుత్వం యూపీని ప్రపంచానికి కర్మాగారం మారుస్తుందని చెప్పారు. అమెరికా మాజీ ప్రధమ మహిళ మిషెల్‌ ఒబామా కూడా తన వంట గదిలో ‘మేడిన్ జౌన్ పూర్‌’ పాత్రల్ని కలిగి ఉండే రోజు వస్తుందన్నారు. ‘మేడిన్  ఉత్తరప్రదేశ్‌’ ఉత్పత్తులు ప్రపంచమంతా లభ్యమవుతాయని పేర్కొన్నారు.

‘మోదీకి తప్పనిసరిగా సాయం చేయాలని నేను అఖిలేశ్‌కి చెప్పాను. ఆయనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని కోరా. అఖిలేశ్‌ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మోదీ విశ్రాంతి పొందుతారు’ అని రాహుల్‌ చెప్పారు. వారణాసిలో ప్రధాని మోదీ వరుస రోడ్‌షోలపై స్పందిస్తూ... మోదీ సినిమాలో పదే పదే రీటేక్‌లు తీసుకుంటున్నారని చమత్కరించారు.

నాలుగు రోజుల్లో నాలుగు రీటేక్‌లు తీసుకున్నారని, అయితే ఆశించిన ఫలితం దక్కలేదని ఎద్దేవా చేశారు. వారణాసి ఫలితంపై మోదీ భయపడుతున్నారని, అందుకే గత మూడు రోజులుగా అక్కడే ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్‌ ఆరోపించారు. గంగా మాత పుత్రుడిగా మోదీ అభివర్ణించుకోవడాన్ని తప్పుపడుతూ... భారత్‌లో గంగా నదికి ఒక్కరే కొడుకు ఉన్నారా? అన్న ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పాలన్నారు.

మరిన్ని వార్తలు