‘ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు’

6 Mar, 2020 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యస్‌ బ్యాంక్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ సర్కార్‌ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ‘యస్‌ బ్యాంక్‌ కాదు..మోదీ ఆయన ఆలోచనా విధానాలు ఆర్థిక వ్యవస్థను పతనం బాటన పయనింపచేస్తున్నాయ’ని ఆరోపించారు. యస్‌ బ్యాంక్‌ కార‍్యకలాపాలపై ఆర్బీఐ మారటోరియం, నెలకు ప్రతి ఖాతాకూ రూ 50,000 వరకూ విత్‌డ్రాయల్‌ పరిమితి విధించడం వంటి ఆంక్షల నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యస్‌ బ్యాంక్‌ నిర్వాకంతో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక సంస్థలను ఎలా నియంత్రిస్తున్నదో తేటతెల్లమైందని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. మొదట పీఎంసీ బ్యాంక్‌...ఇప్పుడు యస్‌ బ్యాంక్‌ రేపు మూడో బ్యాంక్‌ సంక్షోభానికి సిద్ధంగా ఉందా అని వరుస ట్వీట్లలో ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందా..? ఇంత జరిగినా మోదీ సర్కార్‌ ఏమైనా పట్టించుకుంటోందా..? అంటూ చిదంబరం నిలదీశారు.

చదవండి : ఫోన్‌ పే సేవలకు యస్‌ బ్యాంకు సెగ

మరిన్ని వార్తలు