రాఫెల్‌ డీల్‌పై రాహుల్‌ : మోదీకి నిద్రలేని రాత్రులు

2 Nov, 2018 18:27 IST|Sakshi
కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూడిల్లీ : రాఫెల్‌ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.ఈ ఒప్పందంపై విచారణ చేపడితే చర్యలు తప్పవనే భయంతో ప్రధాని మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు.  దసాల్ట్‌ ఏవియేషన్‌ సీఈవో ఎరిక్‌ ట్రాపిర్‌ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంబానీ భూమిని కొనుగోలు చేసిన అనంతరమే అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా దసాల్ట్‌ నియమించిందని ఆరోపించారు.

నాగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో భూములున్నందునే హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)ను కాదని, రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకున్నట్టు దసాల్ట్‌ ఏవియేషన్‌ ఇటీవల వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. హెచ్‌ఏఎల్‌కు ఎక్కువ భూములున్నా పక్కనపెట్టి మరీ అంబానీ కంపెనీని భాగస్వామిగా ఎంచుకున్నారని రాహుల్‌ ఆరోపించారు. అనిల్‌ అంబానీకి నాగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద భూములున్నందునే కాంట్రాక్టును ఇచ్చినట్టు దసాల్ట్‌ సీఈవో చెబుతున్నారని, అయితే దసాల్ట్‌ ఇచ్చిన డబ్బుతోనే అనిల్‌ అంబానీ భూములను కొనుగోలు చేసినట్టు వెల్లడైందని రాహుల్‌ ఆరోపించారు.

రాఫెల్‌ డీల్‌ ప్రధాని నరేంద్ర మోదీ, అనిల్‌ అంబానీల మధ్య భాగస్వామ్య ఒప్పందమేనని దుయ్యబట్టారు. రాఫెల్‌ ఒప్పందంపై విచారణకు సిద్ధమైనందునే సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మను తప్పించారని ఆరోపించారు. ఈ ఒప్పందంపై విచారణ జరిపితే మోదీ తప్పించుకోలేరని, ఇందుకు అవినీతి ఓ కారణమైతే, విధాన నిర్ణేతగా ప్రధాని దోషిగా నిలబడాల్సిందేనన్నారు. అనిల్‌ అంబానీకి రూ 30,000 కోట్లు కట్టబెట్టేందుకు మోదీ, అంబానీల మధ్య జరిగిన ఒప్పందం ఇదని రాహుల్‌ అభివర్ణించారు. రాఫెల్‌ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ చేపడితే స్వాగతిస్తామన్నారు.

మరిన్ని వార్తలు