త్వరలోనే రాహుల్‌కు పగ్గాలు!

14 Oct, 2017 04:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించటం ఖాయమని తేలిపోయింది. దీనిపై ఆ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ సానుకూల సంకేతాలిచ్చారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పుస్తకాల మూడో సంకలనం విడుదల సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా మాట్లాడుతూ.. ‘మీరు చాలా కాలంగా ఇదే ప్రశ్న (రాహుల్‌కు పార్టీ బాధ్యతల అప్పగింత) అడుగుతున్నారు. ఇప్పుడదే జరగనుంది’ అని చిరునవ్వుతో వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌.. బాధ్యతల స్వీకరణపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

కాగా, కొత్త అధ్యక్షుడిపై నిర్ణయించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ త్వరలోనే సమావేశం కానుంది. ఇప్పటికే దాదాపు రాష్ట్రాల కమిటీలు కూడా రాహుల్‌కు బాధ్యతలు అప్పగించాలంటూ తీర్మానాలు చేశాయి. మిగిలిన పీసీసీలు రెండు, మూడ్రోజుల్లో సమ్మతి తెలపనున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షులు, పార్టీ కేంద్ర కమిటీల ఎంపిక తర్వాత అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోందని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. అయితే.. గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత పీసీసీలకు కొత్త చీఫ్‌లను (రాహుల్‌ టీం) ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు