కాంగ్రెస్ పార్టీకి గుదిబండ ఎవరు?

18 May, 2016 10:04 IST|Sakshi
కాంగ్రెస్ పార్టీకి గుదిబండ ఎవరు?

రెండేళ్ల పాలనలో అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా.. మోదీకి మాత్రం ప్రజలు ఇప్పటికీ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారట. కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద గుదిబండగా రాహుల్ గాంధీ అవతరిస్తున్నారట. ఈ విషయాలన్నింటినీ ఎవరు చెప్పారో తెలుసా? ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కేవలం అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయాన్నే కాదు.. ఇంకా చాలా సంగతుల గురించి సమాచారం సేకరించాయి. అప్పుడే ఈ పై విషయాలు కూడా తెలిశాయని సెఫాలజిస్టులు చెప్పారు. అసోంలో తరుణ్ గొగోయ్ సుదీర్ఘ పాలనకు అంతం పలుకుతూ తొలిసారి అక్కడ కాషాయ జెండా ఎగరేస్తున్నారని.. బీజేపీ, ఏజీపీ, బీపీఎఫ్‌లతో కూడిన ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తం ఓటర్లలో మూడోవంతు ముస్లింలే ఉన్న అసోంలో హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా పడేందుకు మోదీ- అమిత్ షా పన్నిన వ్యూహాలు గట్టిగా పనిచేశాయని అంటున్నారు. బిహార్, ఢిల్లీలలో ఎదురుదెబ్బ తిన్న అమిత్‌షాకు ఈ విజయం మంచి ఊరట అవుతుందని భావిస్తున్నారు.

కేంద్రం విషయానికొస్తే.. మోదీ పాలన ప్రారంభమై రెండేళ్లు దాటుతుండటంతో ఈ పాలనపై కూడా ఎగ్జిట్ పోల్స్‌ సమయంలో ప్రశ్నలు అడిగారు. ఈ సమయంలోనే మోదీకి, ఆయన పథకాలకు మంచి మార్కులు వేసిన ఓటర్లు.. రాహుల్ గాంధీ విషయంలో మాత్రం పెదవి విరిచారట. ఒకరకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద గుదిబండగా తయారవుతున్నాడని కూడా చాలామంది అభిప్రాయపడినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. అసోంలో ఇప్పటికే ఉన్న అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. పశ్చిమబెంగాల్‌లో వామపక్షాలతో కలిసినా చావుదెబ్బ తినడం ఆ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటో స్పష్టం చేస్తోందంటున్నారు.

తమిళనాడులో డీఎంకేతో కలిసి అధికారాన్ని పంచుకోబోతున్నా.. అక్కడ ప్రాంతీయ పార్టీదే పెద్దన్న పెత్తనం అవుతుంది. పైపెచ్చు, డీఎంకే ఇప్పటికే 2జి స్కాంలో పీకల్లోతు కూరుకుపోయింది. అలాంటి పార్టీతో జతకట్టి, ఒకటి.. అర పదవులు పంచుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండబోదని అంటున్నారు. కేరళలో కూడా అధికారం కోల్పోతోంది. మరోవైపు బీజేపీ మాత్రం కేంద్రంలో రెండేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదని విమర్శలు వస్తున్నా.. అసోంలో కొత్తగా అధికారం సాధించడంతో పాటు కేరళలో తొలిసారి ఒకటో రెండో స్థానాలలో బోణీ కొట్టబోతోందని అంటున్నారు. దానికితోడు అధికారం రాని రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజాదరణకు మాత్రం లోటు లేదని సర్వేలలో పాల్గొన్నవారు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ చేపట్టడానికి ఇప్పుడప్పుడే సమయం ఆసన్నం కానట్లే అనుకోవాలేమో!

మరిన్ని వార్తలు