ఆయనేమన్నా కాలేజీ కుర్రాడా..!

8 Jun, 2017 18:03 IST|Sakshi
రాహుల్‌పై హోంమంత్రి ఘాటు విమర్శలు
మాంద్‌సౌర్‌: ‘ఒక హెల్మెట్‌ కూడా ధరించకుండా కాలేజీ విద్యార్థిలాగా రాహుల్‌గాంధీ బైక్‌ డ్రైవింగ్‌ చేసుకుంటూ ఒక జాతీయ పార్టీ నేత వెళ్లడం తగదు’ అని మధ్యప్రదేశ్‌ హోమంత్రి భూపేంద్ర సింగ్‌ రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సౌర్‌లో పోలీసుల కాల్పుల్లో చనిపోయి, గాయాలపాలయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు మద్దతుదారులతో కలిసి వచ్చారు. అయితే, మాంద్‌సౌర్‌కు కిలోమీటర్‌ దూరం ఉండగానే ఆయనను అడ్డుకునేందుకు పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేశారు.

తొలుత కారులో వచ్చిన ఆయన బారీకేడ్స్‌ను దాటేసి ముందుకెళ్లే యత్నం చేశారు. అడ్డుకోవడంతో వెంటనే ఒక బైక్‌ తీసుకున్నారు. అక్కడ ఆపేయడంతో దిగి వెంటనే మరో బైక్‌ తీసుకున్న ఆయన మరింత వేగంగా ముందుకు కదిలారు. మళ్లీ అడ్డుకోవడంతో చివరకు కాలినడకన చేరేందుకు ప్రయత్నం చేయగా చివరకు పోలీసులు అదుపులోకి తీసుకొని తొలుత గెస్ట్‌హౌస్‌కి అటు నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఈ నేపథ్యంలో బైక్‌ తీసుకుని వెళ్లే సమయంలో రాహుల్‌ హెల్మెట్‌ కూడా లేకుండా కాలేజీ కుర్రాడిలా వెళ్లారని, జాతీయ నేతకు అది సరికాదంటూ రాష్ట్ర హోంమంత్రి విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ నేత సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ తాము రైతులకు సానుభూతిగా వెళ్లామని, అందరూ శాంతియుతంగా ఉండాలని, సామరస్యం పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేందుకు వెళ్లామని, పోలీసులు మాత్రం చాలా అతి చేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబాల వాళ్లు తమను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నా వారు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
మరిన్ని వార్తలు