ఆ తప్పులను చక్కదిద్దండి..

27 Nov, 2018 20:46 IST|Sakshi

న్యూఢిల్లీ : గత పదిహేను సంవత్సరాల్లో జరిగిన తప్పులను చక్కదిద్దాలని మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఆ రాష్ట్ర ఓటర్లను కోరారు. తప్పుడు వాగ్ధానాలతో ఒకటిన్నర దశాబ్ధాలుగా బీజేపీ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, పేదలను హింసిస్తూ మధ్యప్రదేశ్‌ ప్రతిష్టను బీజేపీ ప్రభుత్వం మసకబార్చిందని దుయ్యబట్టారు. మద్దతు ధర పెంచాలని అడిగిన రైతులను కాల్చివేశారని, యువతకు అవకాశాలు మృగ్యమయ్యాయని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో రాహుల్‌ పేర్కొన్నారు. వ్యాపం కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ యువత భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడిన తీరును గుర్తుచేశారు.

ఇసుక మాఫియా, ఈ ట్రేడర్‌ స్కామ్‌, బుందేల్‌ఖండ్‌ ప్యాకేజ్‌ స్కామ్‌లను తన పోస్ట్‌లో రాహుల్‌ ప్రస్తావించారు. కాంగ్రెస్‌ వాగ్ధానాలను మధ్యప్రదేశ్‌ ప్రజలు విశ్వసించాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని, ఇళ్లకు 24 గంటల విద్యుత్‌ సరఫరా అందుబాటులోకి తెస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

యువతకు ఉపాధి అవకాశాలు, వ్యాపారాల వృద్ధి, పేదలకు భద్రతతో కూడిన జీవనాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పరిస్థితి బాగుపడితే ఆర్థిక వ్యవస్థ సైతం మెరుగవుతుందని రాహుల్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 28న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, డిసెంబర్‌ 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలు