ప్రత్యూష ఎఫ్ఐఆర్ లో సంచలన అంశాలు!

6 Apr, 2016 12:27 IST|Sakshi
ప్రత్యూష ఎఫ్ఐఆర్ లో సంచలన అంశాలు!

ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను అరెస్టు చేసేందుకు పోలీసుల రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న రాహుల్ డిశ్చార్జ్ అయిన వెంటనే అతన్ని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పడం, ఆమెపై దాడి చేయడం, బెదిరించడం వంటి అభియోగాలతో పోలీసులు అతనిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నారు.

మరోవైపు ఈ కేసు ఎఫ్ఐఆర్ లోనూ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రత్యూష తల్లిదండ్రులు సోమ, శంకర్ బెనర్జీ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రాహుల్ కు సంబంధించి పలు విషయాలు తెలిపారు. ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలం ప్రకారం.. ప్రత్యూష టీవీ నటిగా ప్రాచుర్యం పొంది.. బాగా సంపాదిస్తున్న తర్వాతే రాహుల్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. అంతకుముందే అతనికి గత సంబంధాల వల్ల తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. 'రాహుల్ తన ఆస్తుల గురించి ప్రత్యూషకు అబద్ధాలు చెప్పాడు. అతను తనకు ముంబైలో నాలుగు ఫ్లాట్లు, సొంతూరిలో 150 ఎకరాల భూమి ఉందని చెప్పాడు. తన తల్లి ఎమ్మెల్యే అని నమ్మబలికాడు. అలా ప్రత్యూష జీవితాన్ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులను కలువకుండా ఆమెను అడ్డుకున్నాడు. మొబైల్ ఫోన్ కూడా వినియోగించనివ్వలేదు. ప్రత్యూష పాత సంబంధాలను గుర్తుచేసి ఆమెను తిట్టేవాడు. కొట్టేవాడు. ఒకప్పుడు వారు నివసించిన కాందివ్లి హౌస్ లో గట్టిగా అరుపులు వినిపించేవని, రాహుల్ కొట్టినప్పుడల్లా ప్రత్యూష బాధతో అరిచేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు' అని ఆమె తల్లిదండ్రలు పోలీసులకు వివరించారు.

రాహుల్ చేసిన అప్పులు పెరిగిపోయి ఇంటి అద్దె కూడా కట్టడం కష్టమైపోయిందని, దీంతో ఆర్థిక కష్టాలు కూడా వారిని చుట్టుముట్టాయని తెలిపారు. తాము మొదట తమ కూతురితో ముంబైలోనే ఉండేవాళ్లమని, తల్లిదండ్రులతో ఉంటే నిన్ను వదిలేస్తానని రాహుల్ హెచ్చరించడంతో ఆమె రాహుల్ తోనే ఉండటం ప్రారంభించిందని చెప్పారు. రాహుల్ తనను హింసిస్తున్నాడని ప్రత్యూష తన అంకుల్ దీపాంకుర్, ఆయన భార్యకు గత జనవరిలో చెప్పిందని, రాహుల్ వల్ల తన కాలిపై జరిగిన గాయాన్ని కూడా వారికి చూపిందని తల్లిదండ్రులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రత్యూష ఆత్మహత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు ఆమె తల్లి సోమతోపాటు మరో 12 మంది వాంగ్మూలం కూడా సేకరించాలని భావిస్తున్నారు. ఆమె స్నేహితులు, ఆమె నివాసం సెక్యూరిటీ గార్డ్స్, ప్రత్యూష ఫ్లాట్ తాళం తెరిచేందుకు రాహుల్ పిలిపించిన తాళంచెవి తయారీదారు, ప్రత్యూష భౌతికకాయాన్ని మొదట చూసిన వారి ఇంటి వంట మనిషి తదితరుల నుంచి సాక్ష్యాలను సేకరించాలని వారు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు