బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనే..

21 Oct, 2019 12:59 IST|Sakshi

న్యూఢిల్లీ : ఈవీఎంల్లో ఏ బటన్‌ నొక్కినా ప్రతి ఓటూ పాలక పార్టీకే వెళుతుందని హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఓ బీజేపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఈ వ్యాఖ్యలు చేసి ఈసీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే బక్షిత్‌ సింగ్‌ విర్క్‌ను ఉద్దేశిస్తూ బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనేనని రాహుల్‌ వ్యాఖ్యానించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతుండగా రాహుల్‌ ఈ మేరకు ట్వీట్‌ చేయడంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను పోస్ట్‌ చేశారు.

కాగా తాను పోటీ చేస్తున్న అసంధ్‌ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్ధి బక్షిత్‌ సింగ్‌ విర్క్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీలో ఎవరు ఓటు వేసేందుకు వెళ్లినా మాకు తెలుస్తుంది..మాకు తెలియదని అనుకోకండి..మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవాలనుకుంటే మేం తెలుసుకోగలం ఎందుకంటే మోదీజీ చాలా తెలివైనవారు..మనోహర్‌ లాల్‌ (హర్యానా సీఎం) తెలివైన వార’ంటూ ఆయన మాట్లాడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. మీరు ఎవరికి ఓటు వేసిన అది కమలం గుర్తుకే వెళుతుంది..ఈవీఎంల్లో మేం ఇందుకు తగిన ఏర్పాటు చేశామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వీడియోపై తీవ్రంగా స్పందించిన ఈసీ బీజేపీ అభ్యర్థి విర్క్‌కు నోటీసులు జారీ చేసింది. అసంద్‌ నియోజకవర్గంలో పోలింగ్‌ పర్యవేక్షణకు ప్రత్యేక అబ్జర్వర్‌ను నియమించింది. కాగా తాను మాట్లాడినట్టు నకిలీ వీడియోను వైరల్‌ చేస్తున్నారని, ఈవీఎంలపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు