విగ్రహంపై రాహుల్‌ విస్మయం..

31 Oct, 2018 16:07 IST|Sakshi
కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పందించారు. స్వాతంత్ర సమరయోధుడు వల్లభాయ్‌ పటేల్‌ నిర్మించిన వ్యవస్థలను మోదీ సర్కార్‌ కుప్పకూల్చిందని రాహుల్‌ ఆరోపించారు. పటేల్‌ నిర్మించిన సంస్థలను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడం విస్మయంగా ఉందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలను వ్యూహత్మకంగా ధ్వంసం చేయడం రాజద్రోహం కన్నా తక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు.

సీబీఐ, ఆర్‌బీఐల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సీబీఐలో ఉన్నతాధికారుల మధ్య వివాదం, పరస్పరం అవినీతి ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్ధానం దర్యాప్తు ఏజెన్సీని చక్కదిద్దేందుకు చొరవ చూపాల్సిన పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆర్‌బీఐలో సెక్షన్‌ 7 ప్రయోగించడం ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందనే వార్తలు దుమారం రేపాయి. కేంద్ర బ్యాంక్‌లో ప్రభుత్వ జోక్యంపై ఆందోళనలు వ్యక్తమైన క్రమంలో ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడతామని కేంద్రం వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు