వ్యవస్థలపై అజమాయిషీ ప్రమాదకరం: రాహుల్‌

5 Oct, 2018 13:27 IST|Sakshi
హిందుస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ప్రసంగిస్తున్న కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాందీ

న్యూఢిల్లీ : దేశంలో వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం ప్రమాదకరమని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్‌ ఎన్నడూ పూనుకోదని, ఇవి తమ పార్టీకి చెందినవి కాదని దేశానివని తాము విశ్వసిస్తామన్నారు. వ్యవస్థలన్నింటిపైనా ఆరెస్సెస్‌ భావజాలం రుద్దుతున్నారని ఆరోపించారు. హిందుస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన సంస్థలను దేశం ఆవిష్కరించాల్సి ఉందన్నారు.

తాము అధికారంలోకి వస్తే చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలను బలోపేతం చేయడంతో పాటు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం, అందుబాటు ధరల్లో విద్యా, వైద్య మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పరిశ్రమతో కలిసి రైతులు పనిచేసే వాతావరణం కల్పించడం, విద్వేష భావనలను తొలగించడం తక్షణ కర్తవ్యంగా ముందుకెళతామన్నారు. సమస్యలను ఓపిగ్గా వినడం అవసరమని, తాను ఎదుటివారు చెప్పింది శ్రద్ధగా ఆలకిస్తానని రాహుల్‌ పేర్కొన్నారు. దేశ విదేశాంగ విధానం వ్యూహాత్మకంగా లేదని విమర్శించారు.

నిరుద్యోగంతో యువత సతమతమవుతున్నదని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందన్నారు.  కేవలం తాము మాత్రమే దేవాలయాలను సందర్శిస్తామని బీజేపీ భావిస్తోందన్నారు. బీజేపీతో సిద్ధాంత పరంగా కేవలం కాంగ్రెస్‌ మాత్రమే పోరాడుతోందన్నారు. ప్రజల జీవితాలను సరళతరం చేసేందుకు ప్రవేశపెట్టిన ఆధార్‌ ఇప్పుడు ప్రజలను పర్యవేక్షించే పరికరంగా మారిందన్నారు.

నోట్ల రద్దు తిరోగమన చర్య
మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు అనాలోచిత చర్యగా రాహుల్‌ అభివర్ణించారు. నోట్ల రద్దుతో సామాన్యులు బ్యాంకు క్యూల్లో కూలబడగా, సంపన్నులు దర్జాగా తమ నల్లధనాన్ని వైట్‌గా మార్చుకున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని, దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఇప్పుడు ఎవరితోనూ చర్చలు జరిపే స్థితిలో లేదని దుయ్యబట్టారు.

ప్రత్యేక వ్యక్తి ఎవరూ లేరు
తనకు తోడుగా తల్లి, చెల్లి, స్నేహితులున్నారని.. తన జీవితంలో ప్రత్యేక వ్యక్తి అంటూ ఏ ఒక్కరూ లేరని రాహుల్‌ స్పష్టం చేశారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తామని భావిస్తున్నారనే ప్రశ్నకు రాహుల్‌ బదులిస్తూ చాలా సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిర్ధిష్ట సంఖ్యను చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

మరిన్ని వార్తలు